మూవీ రివ్యూ: ఫ్యామిలీ స్టార్
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, అభినయ, ప్రభాస్ శ్రీను తదితరులు
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫర్: మోహనన్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
కథ, కథనం, మాటలు, దర్శకుడు: పరశురాం పెట్ల
నిర్మాత: దిల్ రాజు
కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఫ్యామిలీ స్టార్ పేరు బాగా వినిపిస్తుంది. దాన్ని దిల్ రాజు ఆ రేంజ్‌లో ప్రమోట్ చేసారు మరి. పైగా విజయ్ దేవరకొండ కూడా తనకు కలిసొచ్చిన ఫ్యామిలీ జోనర్‌లో సినిమా చేయడంతో అంచనాలు కూడా అలాగే పెరిగిపోయాయి. మరి ఫ్యామిలీ స్టార్ ఆ అంచనాలు అందుకుందో లేదో చూద్దాం..
ఓ మధ్య తరగతి కుటుంబం.. అందులో ముగ్గురు అన్నాదమ్ములు.. ఇద్దరు వదినలు.. వాళ్ల పిల్లలు.. ఓ బామ్మ.. వీళ్లందర్నీ ఒంటెద్దు బండిలా పోషించే గోవర్ధన్ (విజయ్ దేవరకొండ). అచ్చమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అవన్నీ ఇందులో ఉంటాయి. కుటుంబం మీద ఈగ వాలినా కూడా ఊరుకోడు.. ఎవరైనా వేలెత్తి చూపిస్తే భరించలేడు. కుటుంబం అంటే గోవర్ధన్‌కు అంత ప్రాణం. అలాంటి వాడి జీవితంలోకి సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే ఇందు (మృణాల్ థాకూర్) వస్తుంది. చూడగానే ఆమెకు కనెక్ట్ అయిపోతాడు గోవర్ధన్. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఇందు చేసిన ఓ పనికి గోవర్దన్ బాగా డిస్టర్బ్ అవుతాడు. అనుకుంటే మధ్య తరగతి వాడు సాధించలేనిది ఏదీ లేదని చూపించడానికి.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ (జగపతిబాబు)లో మంచి ఉద్యోగంలో చేరతాడు. ఆ తర్వాత అమెరికా కూడా వెళ్తాడు. అయితే గోవర్దన్ లైఫ్‌లోకి ఇందు ఎందుకొచ్చింది.. ఏం తప్పు చేస్తుంది.. ఎందుకంతగా ఆమెను ద్వేషిస్తాడు అనేది మిగిలిన కథ..
కొన్ని సినిమాలు చూడ్డానికి రొటీన్‌గానే ఉంటాయి.. ఏంటబ్బా ఒకే కథను ఎన్నిసార్లు తీస్తారు అనిపిస్తుంది. కానీ అవే కథల్లో ఈజీగా కనెక్ట్ అయిపోయే ఓ చిన్న మ్యాజిక్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ కూడా అలాంటి సినిమానే.. అలాంటి కథే. ఇదేం కొత్త కాదని దిల్ రాజే చెప్పాడు.. ఎన్నో సినిమాల్లో చూసిందే. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.. దాన్ని ఒంటెద్దు బండిలా నడిపించే ఒక్కడు.. కుటుంబం జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్లే తెగింపు.. ఇదే ఫ్యామిలీ స్టార్ కథ. ఫస్టాఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు.. ఫన్నీ మూవెంట్స్‌తో బాగానే వెళ్తుంది కథ. ఇంటర్వెల్ వరకు ఎమోషన్స్, కామెడీ అన్నీ బాగానే పండాయి. ముఖ్యంగా కుటుంబంతో పాటు విజయ్ దేవరకొండ మూవెంట్స్ అన్నీ బాగానే అనిపిస్తాయి. కుటుంబం జోలికి వచ్చినపుడు వచ్చే యాక్షన్ సీన్స్.. మృణాళ్ వచ్చాక వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. కీలకమైన సెకండాఫ్ మాత్రం అక్కడక్కడా ట్రాక్ తప్పినట్లు అనిపించింది. ముఖ్యంగా స్లో నెరేషన్ ఫ్యామిలీ స్టార్ సినిమాకు మైనస్ అయింది. అమెరికా ఎపిసోడ్‌లో విజయ్ పంచులు వర్కవుట్ అయ్యాయి. వద్దన్నా అక్కడక్కడా గీతా గోవిందం రిఫరెన్సులు కనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఓ ఎపిసోడ్ అంతా అలాగే రాసుకున్నాడు దర్శకుడు పరశురామ్. ఫస్టాఫ్‌లో విజయ్ దేవరకొండ నటనతో పాటు రెండు ఫైట్ సీక్వెన్సులు కూడా కథలో కలిసిపోయాయి. ముఖ్యంగా కుటుంబం గొప్ప గురించి చెప్పే సీన్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతాయి. అమెరికా ఎపిసోడ్‌లో వచ్చే ఓ అమ్మాయిల ఎపిసోడ్ బాగానే నవ్విస్తుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ వరకు కథ బాగానే వెళ్లినా.. ఆ తర్వాత రొటీన్ క్లైమాక్స్ అనిపిస్తుంది. అది కాస్త మైనస్ అయింది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఫ్యామిలీ స్టార్ ఈ సమ్మర్‌లో కుటుంబంతో పాటు చూసేలాగే తెరకెక్కించాడు దర్శకుడు పరశురామ్.
విజయ్ దేవరకొండ సినిమాలో కుటుంబాన్నే కాదు.. సినిమాను కూడా ఒక్కడే మోసాడు. రౌడీ బాయ్ ఉంటే.. పాత కథ కూడా కొత్తగానే అనిపిస్తుంది.. మనోడి స్క్రీన్ ప్రజెన్స్ అలా ఉంటుంది మరి ఏం చేస్తాం.. వన్ మ్యాన్ షో చేసాడు. మృణాళ్ ఠాకూర్ పర్లేదు. మొదటి రెండు సినిమాల మాదిరే ఇందులో కూడా నటనతో ఆకట్టుకున్నారు. బామ్మ పాత్ర కూడా బాగుంది. అన్నయ్యల పాత్రపై పెద్దగా ఫోకస్ చేయలేదు దర్శకుడు. ఇక ప్రభాస్ శీను, వెన్నెల కిషోర్ పాత్రలు పర్లేదు.
గోపీ సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు ఓకే అనిపిస్తుంది. గీత గోవిందం రేంజ్ మాత్రం ఆశించకూడదు. మార్తండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఓకే. మోహనన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఇక దర్శకుడు పరశురామ్ గత సినిమాల్లో ఉన్న బలమైన ఎమోషన్స్ ఇందులో అంతగా కనబడలేదు. కానీ చాలా చోట్ల రైటింగ్ బలం కనిపించింది. ముఖ్యంగా ఫ్యామిలీ గురించి రాసుకొచ్చిన మాటలన్నీ ఆకట్టుకుంటాయి. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ చెప్పనక్కర్లేదు.. చాలా రిచ్‌గా ఉన్నాడు ఈ ఫ్యామిలీ స్టార్.
ఓవరాల్‌గా ఫ్యామిలీ స్టార్.. క్లీన్ ఎంటర్‌టైనర్.. ఓసారి కుటుంబంతో పాటు చూడొచ్చు..