
టాలీవుడ్‌లో తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఊడుగుల. ‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ వంటి విభిన్నమైన చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన.. ఇటీవలే మరో కొత్త బాధ్యతను భుజాన వేసుకున్నారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిర్మాతగా ఆయన వ్యవహరించిన తొలి సినిమా మంచి స్పందనను అందుకోవడంతో వేణు పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది. వేణు ఉడుగుల నిర్మాతగా వ్యవహరించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా గతంలో వేణు ఊడుగుల.. తన సినిమా ప్రయాణంతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కొన్ని కష్టాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణుతో తనకున్న అనుబంధం గురించి వేణు ఊడుగుల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి ఆసక్తికరంగా మారాయి. తన కెరీర్ ప్రారంభ దశలో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆయన వెల్లడించారు. వేణు ఊడుగుల మాట్లాడుతూ.. తన తొలి సినిమా ‘నీది నాది ఒకే కథ’ ప్రారంభించే సమయానికి ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని తెలిపారు. అప్పుల కారణంగా తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడినని, ఆ సమయంలో తన పరిస్థితిని శ్రీవిష్ణు గమనించాడని చెప్పారు. ఒకసారి తనను చూసిన శ్రీవిష్ణు.. ఎందుకు ఎప్పుడూ ఏదో బాధలో ఉన్నట్టు కనిపిస్తున్నావని అడిగాడని వేణు గుర్తుచేసుకున్నారు. ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయా.?, అప్పులు ఉన్నాయా.? అని ఆరా తీశాడని చెప్పారు. మొదట పెద్ద విషయం కాదన్నట్టుగా తాను సమాధానం ఇచ్చినా.. తన పరిస్థితిని శ్రీవిష్ణు అర్థం చేసుకున్నాడని తెలిపారు.
అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనను మాత్రం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని వేణు ఊడుగుల అన్నారు. తన ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న శ్రీవిష్ణు.. మరుసటి రోజే తన అప్పులను తీర్చేందుకు సహాయం చేశాడని వెల్లడించారు. తనకు సహాయం చేయాల్సిన అవసరం శ్రీవిష్ణుకు ఏమాత్రం లేకపోయినా, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అండగా నిలిచాడని ఎమోషనల్ గా చెప్పారు. ఆ సమయంలో శ్రీవిష్ణు చేసిన సహాయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నాకు కేవలం హీరో మాత్రమే కాదు.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వ్యక్తి. అందుకే ఆయనను నా జీవితంలో ఒక దైవంలా భావిస్తాను అంటూ వేణు ఊడుగుల చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.