
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డైలాగ్ రైటర్ గా ,సినీ రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు త్రివిక్రమ్. ముఖ్యంగా టాలీవుడ్ లో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అ ఆ, అరవింద సమేత, అల వైకుంఠపురములో, గుంటూరు కారం సినిమాలతో తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు త్రివిక్రమ్. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే మరో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. హీరో వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ యాంకర్ సుమతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా వెంకీ, త్రివిక్రమ్ ల వ్యక్తిగత విషయాలతో పాటు వారి సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి సుమ సరదాగా ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే సుమ త్రివిక్రమ్ తో మాట్లాడుతూ.. ‘అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన విధంగా సింహం మాత్రమే కాదు త్రివిక్రమ్ కూడా గడ్డం గీసుకోరు ఎందుకు? అని ప్రశ్నించింది. దీనికి త్రివిక్రమ్ సమాధానం చెబుతూ ‘పెళ్లయిన కొత్తలో నా భార్య కూడా గడ్డం లేకుండా చూసింది. అయితే అప్పటినుంచి నేను ఇలా గడ్డంతోనే ఉన్నాను. నేను గడ్డం తీసేస్తే బహుశా నన్ను ఎవరు గుర్తుపట్టరేమో అందుకే తీయట్లేదు. నా ఆధార్ కార్డ్ ,పాస్ పోర్ట్ అన్నింటిలో కూడా నా ఫోటో గడ్డంతోనే ఉంది. ఇప్పుడు గడ్డం తీసేస్తే ఇమిగ్రేషన్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడూ ఇలాగే గడ్డంతోనే ఉంటాను’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు త్రివిక్రమ్. ప్రస్తుతం ఈ మాటల మాంత్రికుడి కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి