తిండికి డబ్బులులేక ఖాళీ బీరు సీసాలు అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి పొజీషన్లో ఉన్నాడు
సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నటుడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కృష్ణానగర్‌లో పడిన కష్టాలు, ఎస్‌టీడీ బూత్‌లో పని చేయడం, బీరు బాటిళ్లు సేకరించడం వంటి వాటిని గుర్తుచేసుకున్నాడు.

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా రాణించాడు చిత్రం శ్రీను. ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆయన అవకాశాలు అందుకోలేకపోతున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న కష్టాలను, మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు ఎదురైన రెండు మరపురాని సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన తొలి రోజుల గురించి వివరిస్తూ, ఫోటోలు దిగి వెనకాల ఫోన్ నంబర్లు రాసి ఇవ్వాల్సిన రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఫోన్ అందుబాటులో లేకపోవడంతో, కాంటాక్టుల కోసం కృష్ణానగర్‌లోని ఒక ఎస్‌టీడీ బూత్‌లో పనిచేసినట్లు చెప్పారు. అక్కడ పనిచేయడానికి ప్రధాన కారణం, తన కాంటాక్ట్ నంబర్ పొందడం, దానివల్ల సినిమా ఆఫీసులకు తన వివరాలు ఇవ్వడం. అంతేకాదు, పని చేస్తూ టిఫిన్లు, భోజనం కోసం కూడా అక్కడ మూడు గంటలు కూర్చుంటే ఒక పూట ఆకలి తీరేదని తెలిపారు.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో, చిత్ర శ్రీను ఎస్‌టీడీ బూత్ సమీపంలో ఉన్న ఇంద్రలోక కాంప్లెక్స్‌లోని వైన్ షాప్ వద్ద ఒక వినూత్న పద్ధతిని అనుసరించారు. బీరు తాగడానికి ప్లేస్ వెతుకుతున్న వారికి, తాను పనిచేసే ఎస్‌టీడీ బూత్ పై అంతస్తుకు (అక్కడ రాకేష్ మాస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఉండేది) వెళ్లి తాగమని చెప్పేవాడట. వారు ఖాళీ చేసిన బీరు బాటిళ్లను సేకరించి, ఒక్కో బాటిల్‌కు రెండు రూపాయలు చొప్పున అమ్మి అలా వచ్చిన డబ్బుతో ఉదయం టిఫిన్‌కువాడుకునేవాడిని. ఆ తర్వాత రవీంద్ర అనే వ్యక్తి పరిచయంతో ఎస్‌టీడీ బూత్ బయట వార్తాపత్రికలు అమ్మేవాడిని. కృష్ణానగర్‌లో సినిమా పిచ్చితో వచ్చిన చాలా మంది లాగే తాను కూడా ఎన్నో బాధలు, కష్టాలు పడ్డానని శ్రీను పేర్కొన్నారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా ఏ రంగంలోనైనా కష్టపడకుండా ముందుకు వెళ్లలేమని ఆయన దృఢంగా నమ్మారు.
చిరంజీవి గారితో మాస్టర్ సినిమాకు అవకాశం వచ్చిన విధానాన్ని వివరిస్తూ, అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెలక్షన్ కోసం వెళ్ళినప్పుడు చిరంజీవిని చూశానని చెప్పారు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న రాజీవ్ అనే వ్యక్తికి తన ఫోటో ఇచ్చి వచ్చానని తెలిపారు. లాంగ్ హెయిర్ ఉన్న యువకులను కో-ఆర్డినేట్ చేసే ఒక ఫ్రెండ్ ద్వారా తాను మాస్టర్ సినిమాకు సెలక్ట్ అయ్యానని శ్రీను స్పష్టం చేశారు. ఆ సినిమాలో తనకు రెండు మరపురాని సంఘటనలు ఎదురయ్యాయి. మొదటిది, చిరంజీవి కాలేజీ ఎంట్రీ షాట్‌లో ఒక కుర్రాడు సిగరెట్ పట్టుకుని వచ్చి “ఎక్స్‌క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ఉందా?” అని అడగాలి. తాను ఆ పాత్ర చేయడానికి ముందుకు వచ్చానని, చిరంజీవి తన షర్ట్ బాగుండలేదని, మార్చితే బాగుంటుందని చెప్పారట. ఇద్దరు కాస్ట్యూమర్‌లు వచ్చి తనను కాస్ట్యూమ్ రూమ్‌కి తీసుకెళ్లి ఒక ఎర్రటి షర్ట్ వేయించారని చెప్పారు. కోఠి ఉమెన్స్ కాలేజీ వద్ద షూటింగ్ జరుగుతుండగా, సెట్ నుంచి కాస్ట్యూమ్ రూమ్‌కి వెళ్తుండగా చిరంజీవి తన గురించి చెప్పిన మాటలను తలచుకొని కళ్లల్లో నీళ్లు తిరిగాయని, అంతా బ్లర్ అయిపోయిందని శ్రీను భావోద్వేగంగా వెల్లడించారు. చిరంజీవి వంటి స్టార్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ కోసం అలా చెప్పడం తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని అన్నారు. రెండో సంఘటన, ఇంటర్వెల్ ఫైట్ తర్వాత చిరంజీవి మళ్ళీ వచ్చేటప్పుడు తాను “గుడ్ మార్నింగ్ మాస్టర్” అని తప్పించుకోవాలి. ఆ తర్వాత ఒక రోజు షూటింగ్‌కు తాను మిస్ అయినప్పుడు, మరుసటి రోజు వెళ్ళగా, చిరంజీవి “మైఖేల్ రాలేదా?” అని అడిగారని తెలిసింది. చిరంజీవి తనను గుర్తుపెట్టుకొని “మైఖేల్” అని పిలవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, అది కూడా మర్చిపోలేని సంఘటన అని శ్రీను వివరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
