
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్నాళ్ల క్రితం ఓ అవార్డు వేడుకలో కాంతార చిత్రంలోని పంజుర్లి దైవం హావభావాలను ప్రదర్శిస్తూ వెక్కించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కర్ణాటక హైకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే పశ్చాతాపం వ్యక్తం చేసిన ఆయన.. తాజాగా చాముండేశ్వరి దేవి ఆలయాన్ని మంగళవారం దర్శించుకున్నారు.బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఈమధ్య పలు వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు డాన్ 3 చిత్రం నుంచి ఆయన తప్పుకోవడంతో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ఆయనను బ్యాన్ చేసింది. రణవీర్ నటించిన ఏ చిత్రానికి తాము పనిచేయమని తేల్చీ చెప్పింది. తాజాగా మంగళవారం ఉదయం మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. గతంలో ఓ అవార్డుల వేడుకలో కాంతారే చిత్రంలోని పంజుర్లి దైవం హావభావాలను వెక్కించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో రణవీర్ ప్రవర్తన పై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కర్ణాటక హైకోర్ట్ ఆదేశాల మేరకు తన ప్రవర్తన పై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు రణవీర్.
ఏప్రిల్‌లో తన సవరించిన అఫిడవిట్‌ను సమర్పించిన అనంతరం అతడు బేషరతుగా క్షమాపణ చెప్పడంతో కర్ణాటక హైకోర్టు ఆదేశం మేరకు ఈ ఉదయం చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. నాలుగు వారాల్లో బేషరతుగా క్షమాపణలు చెబుతూ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించాలని హైకోర్ట్ ఆదేశించడంతో ఈరోజు మంగళవారం ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు రణవీర్. ముంబై విమానాశ్రయం నుంచి ఆలయంలోని గర్భగుడిలోకి చేరుకునే వరకు మాస్క్ ధరించి కనిపించారు రణవీర్.
నవంబర్ 30, 2025న గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకలో కాంతార చిత్రంలోని ఐకానిక్ సన్నివేశాన్ని అనుకరిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. దీంతో అతడి తీరుపై కన్నడిగులు మండిపడ్డారు. అతడిపై ఇన్ స్టాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. తన పొరపాటుకు క్షమాపణలు చెప్పాడు రణవీర్. “ఈ సినిమాలో రిషబ్ అద్భుతమైన నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశం. ఒక నటుడిగా, ఆ ప్రత్యేకమైన సన్నివేశాన్ని అతను నటించిన తీరులో నటించడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు, అందుకే అతనిపై నాకు అపారమైన ప్రశంసలు ఉన్నాయి. నేను మన దేశంలోని ప్రతి సంస్కృతిని, సంప్రదాయాన్ని, నమ్మకాన్ని ఎల్లప్పుడూ ఎంతో గౌరవిస్తాను. నేను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే, మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను” అంటూ గతంలో తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు రణవీర్ సింగ్.