AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇదే తెలుగు సినిమా పురుడు పోసుకున్న ప్రాంతం..

తెలుగు సినిమా మూలాలు మద్రాసులోని పాండీబజార్‌లో ఉన్నాయి. ఎందరో సినీ ప్రముఖులు తమ కలలను ఇక్కడే పండించుకున్నారు. నారాయణ కేఫ్, గీతా కేఫ్, పాండీబజార్‌లోని చెట్ల కింద చేరి సినిమా వార్తలు, అవకాశాల కోసం చర్చించుకునేవారు. ఎన్టీఆర్, అక్కినేని వంటి దిగ్గజాలకు ఇది ప్రియమైన ప్రదేశం. నేటికీ దాని చరిత్ర వైభవాన్ని గుర్తుచేస్తోంది.

Tollywood: ఇదే తెలుగు సినిమా పురుడు పోసుకున్న ప్రాంతం..
Pandi Bazaar
Ram Naramaneni
|

Updated on: Sep 12, 2026 | 9:07 AM

Share

తెలుగు సినిమా చరిత్రకు మద్రాసుతో విడదీయరాని బంధం ఉంది. నేడు హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరపడినా, దాని మూలాలు మద్రాసు మహానగరంలోనే ఉన్నాయి. తెలుగు సినిమా బుడిబుడి అడుగులు నేర్చుకున్నది అక్కడే. ఎందరెందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సినీ జీవితాలను మద్రాసులోనే ప్రారంభించి, ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ చరిత్రలో పాండీబజార్‌ది ఒక కీలకమైన అధ్యాయం. మద్రాసులోని త్యాగరాయనగర్, అనగా టీ నగర్, ఒకప్పుడు తెలుగు సినిమా వారికి కేంద్రబిందువు. ఈ ప్రాంతంలోని త్యాగరాయ రోడ్డునే పాండీబజార్ అని పిలిచేవారు. ఇది కేవలం ఒక మార్కెట్ ప్రాంతం మాత్రమే కాదు, తెలుగు సినిమా కలలు మొలకెత్తిన, పండించుకున్న పవిత్ర స్థలం. ఇప్పుడు పాండీబజార్ రూపురేఖలు మారి, ఖరీదైన షాపింగ్ సెంటర్‌గా మారినప్పటికీ, దాని చారిత్రక ప్రాధాన్యత చెక్కుచెదరలేదు. తెలుగు సినిమా తొలి రోజుల్లో, పాండీబజార్ సినిమా వారికి ఒక అడ్డా. ఇక్కడ నారాయణ కేఫ్, గీతా కేఫ్ అనే రెండు కాఫీ హోటల్స్ ఉండేవి. నారాయణ కేఫ్ ఇప్పుడు ఆనందభవన్‌గా మారగా, గీతా కేఫ్ ఇప్పటికీ అదే పేరుతో కొనసాగుతోంది. ఈ రెండు హోటల్స్ ఎదురుగా ఉన్న పెద్ద చెట్లు సినిమా వారికి ఒక రకమైన ఇన్ఫర్మేషన్ సెంటర్స్‌గా పనిచేశాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే సినిమా జనం, నటీనటులు ఈ చెట్ల కింద చేరి కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకునేవారు. ఏ సినిమా మొదలవుతుంది, ఏ పాత్రకు ఎవరు నటిస్తున్నారు, కొత్త అవకాశాలు ఏమున్నాయి వంటి విషయాలన్నీ ఇక్కడే తెలిసేవి. చిన్నపాటి ఆర్టిస్టులు ఈ సమాచారం తెలుసుకొని వేషాల కోసం తమ ప్రయత్నాలను ప్రారంభించేవారు.

ఆ రోజుల్లో చాలామంది సినిమా వాళ్లు టీ నగర్‌లోనే నివాసం ఉండేవారు. అప్పటి వాహిని, ఇతర స్టూడియోలు వడపళనిలో ఉన్నప్పటికీ, ఆ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడం వల్ల నటీనటులు, సాంకేతిక నిపుణులు టీ నగర్‌కే మొగ్గు చూపారు. సాయంత్రం కాగానే పాండీబజార్ ప్రాంతం సినిమా జనాలతో సందడి సందడిగా ఉండేది. ఎన్టీఆర్ వంటి గొప్ప నటులు ఆంధ్రా క్లబ్ ఉన్న ప్రాంతంలోనే నివాసం ఉండేవారు. ఆయన సాయంత్రం తన మిత్రులతో కలిసి పాండీబజార్ మీదుగా వాకింగ్ చేసేవారు. అక్కినేని నాగేశ్వరరావు తొలి రోజుల్లో సైకిల్ తొక్కుతూ పాండీబజార్ మీదుగా రోడ్లన్నీ తిరిగేవారు. రాజనాల, రేలంగి, పద్మనాభం, బాలకృష్ణ వంటి నటులు కూడా సైకిళ్లపై పాండీబజార్‌కు వచ్చి, కాఫీ తాగి కబుర్లు మొదలు పెట్టేవారు. రేలంగి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కూడా, స్టూడియో నుంచి తన ఇంటికి వెళ్లేటప్పుడు పాండీబజార్ వైపు వెళ్తూ చిన్నపాటి ఆర్టిస్టులను తన కారులో ఎక్కించుకుని అక్కడ దించి వారిని ప్రోత్సహించేవారు. పాండీబజార్‌లో రమణారెడ్డి చెట్టు అని ఒక చెట్టుకు పేరుంది. రమణారెడ్డి ఎప్పుడూ ఆ చెట్టు కింద నిలబడి కబుర్లు చెబుతుండేవారు. ఆయన సిగరెట్ కాలుస్తూ కబుర్లు చెబుతుంటే చదలవాడ, మోదుకూరి సత్యం లాంటి వాళ్లు ఆయన చుట్టూ చేరి ఆ కబుర్లు వినేవారు.

షూటింగ్ లేని రోజుల్లో ఈ కళాకారులంతా పాండీబజార్‌లోనే కనిపించేవారు. పాండీబజార్‌లో ఇలా కబుర్ల దర్బార్‌ను ప్రారంభించిన ఘనత సి.ఎస్.ఆర్. గారికి దక్కుతుంది. ఆయన్ని ప్రేమగా “పాండీబజార్ ప్రెసిడెంట్” అని పిలిచేవారు. ఆయన కారులో పాండీబజార్‌కు వచ్చి, నారాయణ కేఫ్‌లో కాఫీలు తాగుతూ చెట్టు కింద నిలబడి చెప్పే కబుర్లు ఆసక్తిగా వినేవారు. నేటికీ పాండీబజార్ తన గత వైభవాన్ని గుర్తుచేస్తూ నిలిచి ఉంది. ఆనాటి జ్ఞాపకాలను తనలో ఇముడ్చుకున్న ఆ చెట్లు, ఆ గీతా కేఫ్ తెలుగు సినిమా చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు.

(ఈ సమాచారం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టుల నుంచి సేకరించాం)

Follow Us