95 ఏళ్ల వయసులోనూ సినిమా తపన.. చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
ఎల్లలు దాటిన తన ఆలోచనలతో దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా సినిమాకు నిర్వచనం చెప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో సింగ్ గీతం సినిమాతో అసలు సంభాషణ లేకుండా కేవలం సంగీతం ద్వారానే వెండితెరపై మరో ప్రయోగం చేశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సింగీతం శ్రీనివాసరావు.

తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు, కొత్త ఆలోచనలకు మారుపేరుగా నిలిచిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. వయసు పెరిగినా ఆయనలోని సినిమా పట్ల ఆసక్తి మాత్రం ఏనాడూ తగ్గలేదు. దర్శకుడిగా ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన ఆయన.. జీవిత చరమాంకంలోనూ మరో సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనతో ఉన్నారంటే సినిమా అంటే ఆయనకున్న ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా దర్శకుడిగా పనిచేయడానికి శారీరక శ్రమతో పాటు ఎంతో ఓపిక, ఏకాగ్రత అవసరం. అయితే వయసు తన క్రియేటివిటీకి ఏమాత్రం అడ్డంకి కాదని సింగీతం శ్రీనివాసరావు నిరూపించారు. దాదాపు 95 ఏళ్ల వయసులోనూ ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించారు. సింగ్ గీతం పేరుతో ఆయన రూపొందించిన ప్రాజెక్ట్.. ఈ వయసులోనూ ఆయనలోని క్రియేటివిటీ శక్తికి నిదర్శనంగా నిలిచింది. దర్శకత్వానికి వయసుతో సంబంధం లేదని తన పనితీరుతో చెప్పకనే చెప్పారు సింగీతం.
సింగ్ గీతం తర్వాత కూడా సింగీతం శ్రీనివాసరావు సినిమాలకు పూర్తిగా దూరం కావాలని అనుకోలేదు. మరో చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా వెల్లడించారు. సింగీతం శ్రీనివాసరావుతో జరిగిన వాట్సాప్ సంభాషణను నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఆలోచనను సింగీతం ఆయనతో షేర్ చేసుకున్నట్లు తెలిపారు. సింగీతం శ్రీనివాసరావు తన 62వ చిత్రానికి ‘A Fruit Cuts the Knife’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను అనుకున్నట్లు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయనతో మాట్లాడిన విషయాన్ని, సినిమా చేయాలనే ఉత్సాహాన్ని చివరి రోజుల్లోనూ సింగీతం వ్యక్తం చేసినట్లు నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
ఒక దర్శకుడు తన కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసిన తర్వాత కూడా కొత్త కథలు, కొత్త ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు రావాలని కలలు కనడం అరుదైన విషయం. సింగీతం విషయంలో మాత్రం సినిమా అనేది కేవలం వృత్తి కాదు.. జీవితాంతం కొనసాగిన ఓ అభిరుచి. సింగీతం శ్రీనివాసరావు మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ.. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే ఆయన కన్నుమూయడం సినీ అభిమానులను కలచివేస్తోంది. ఆయన 62వ ప్రాజెక్ట్ కేవలం ఆలోచనగానే మిగిలిపోతుందా.? లేక ఎప్పుడైనా మరొక దర్శకుడు ఆ కథను, ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్తారా.? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ‘A Fruit Cuts the Knife’ అనే విభిన్నమైన టైటిల్ వెనుక ఉన్న కథ ఏమిటి.? సింగీతం శ్రీనివాసరావు ఎలాంటి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు.? అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమా కోసం జీవితాంతం పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు.. చివరి దశలోనూ మరో సినిమా చేయాలని కలలు కనడం ఆయనలోని దర్శకుడి తపనకు నిదర్శనం. ఆ కల నెరవేరకపోయినా.. తెలుగు సినిమా చరిత్రలో ఆయన చేసిన ప్రయోగాలు, చూపించిన మార్గం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
