
ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి 2: ది కంక్లూజన్ లిఖించిన రికార్డులు సామాన్యమైనవి కావు. 2017లో విడుదలైన ఈ చిత్రం సృష్టించిన సునామీ 9 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అలాగే ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్లు కొల్లగొట్టి.. ఇండియన్ మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అమీర్ ఖాన్ దంగల్ సినిమాకు 2070 కోట్లు సాధించినప్పటికీ.. అందులో సింహభాగం చైనా మార్కెట్ నుండే వచ్చింది. కానీ కేవలం భారతీయ మార్కెట్ సత్తాతో, మన ఎమోషన్స్‌తో బాక్సాఫీస్ కొలమానాలను మార్చిన ఘనత మాత్రం నిస్సందేహంగా రాజమౌళికే దక్కుతుంది. గడచిన తొమ్మిదేళ్లలో ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వచ్చినా.. అమరేంద్ర బాహుబలి నెలకొల్పిన బెంచ్‌మార్క్‌ను అందుకోవడం మాత్రం ఎవరివల్లా సాధ్యం కాలేదు. అందరూ బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని ఆశించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ కూడా దగ్గరికి వచ్చి ఆగింది.
నార్త్ నుంచి సౌత్ వరకు ఈ సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఊహించని ఓపెనింగ్స్, రికార్డు స్థాయి కలెక్షన్లతో పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు. 1000 కోట్లు, 1500 కోట్లు దాటుకుంటూ దూసుకెళ్లిన ఈ చిత్రం, 1750 కోట్ల మార్క్ వద్ద ఆగిపోయింది. బాహుబలి 2 రికార్డుకు కేవలం 50 కోట్ల దూరంలో నిలిచిపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించినా.. ఒక రీజనల్ హీరో గ్లోబల్ ఐకాన్‌గా మారి ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇండియన్ సినిమా స్టామినాను మరోసారి చాటిచెప్పింది. ఇప్పుడు అందరి కళ్లు 2026 దీపావళిపైనే ఉన్నాయి. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న పార్ట్ 1 బాక్సాఫీస్ లెక్కలను సమూలంగా మార్చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన ఇతిహాసం కాబట్టి సెంటిమెంట్ పరంగా చూసినా, కాస్టింగ్ పరంగా చూసినా ఈ సినిమాకు బాహుబలి 2 రికార్డులను దాటే సత్తా పుష్కలంగా ఉంది.
పండగ సీజన్, సనాతన ధర్మంపై ఉన్న ఆసక్తి అన్నీ కలిపి రామాయణ పార్ట్ 1 సినిమా 2000 కోట్ల క్లబ్‌లో చేరే మొదటి ప్యూర్ ఇండియన్ సినిమాగా అవతరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు మాస్ యాక్షన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దురంధర్ 2 కూడా రేసులో ఉంది. మార్చి 19న విడుదల కానుంది ఈ చిత్రం. యాక్షన్, ఎలివేషన్స్, భారీతనంతో రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు మనం చూసిన యాక్షన్ సినిమాల స్థాయిని మించి.. హాలీవుడ్ రేంజ్ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ బజ్ ఉంది. మాస్ సెంటర్స్‌లో ఈ సినిమాకు పడే ఓపెనింగ్స్, లాంగ్ రన్ లో వచ్చే కలెక్షన్స్ కచ్చితంగా టాప్ 3 రికార్డుల్లో పెను మార్పులు తీసుకురావడం ఖాయం. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రం బాహుబలి రికార్డులకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే.. కంటెంట్ వర్కవుట్ అయితే 2000 కోట్లు కేక్ వాక్ కాబోతుంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే 2027లో రాబోయే సునామీ మరొక ఎత్తు. రికార్డులు సృష్టించినోడే వాటిని బద్దలు కొట్టాలన్నట్లు, దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడు. వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో మొదలై.. ప్రపంచవ్యాప్తంగా సాగే ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ వారణాసి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇండియన్ ఇండియానా జోన్స్‌గా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ పరంగా.. మేకింగ్ పరంగా ఊహకందని స్థాయిలో ఉండబోతోంది. 1800 కోట్లు కాదు కదా, 3000 కోట్ల మార్క్ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి రాబోయే రెండేళ్లలో భారతీయ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయబడటం ఖాయం. ఎలా చూసుకున్నా.. కచ్చితంగా రాబోయే ఏడాదిలో 9 ఏళ్లుగా ఉన్న బాహుబలి 2 రికార్డులు అయితే బద్ధలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.