
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటల వెనుక ఆసక్తికరమైన కథలు ఉంటాయి. తెరపై ప్రేక్షకులను అలరించిన ఆ పాటలు మొదట ఎవరి కోసం అనుకున్నారు? చివరకు ఎవరి ఖాతాలోకి వెళ్లాయి.? అనే విషయాలు చాలాసార్లు బయటకు రావు. అయితే ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు కోసం రూపొందించిన పాట.. ఆయన అభ్యంతరం కారణంగా మరో స్టార్ హీరో చిరంజీవి సినిమాలోకి వెళ్లి సంచలన విజయాన్ని అందుకుంది. మొన్నామధ్య రచయిత, దర్శకుడు కనగాల జయకుమార్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కనగాల జయకుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. ‘గోపాలకృష్ణుడు’ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సినిమాలో ఏఎన్ఆర్‌పై చిత్రీకరించేందుకు “ఇదేమిటబ్బా..” అంటూ సాగే ఓ పాటను రికార్డు చేశారు. పాట రికార్డింగ్ పూర్తయిన తర్వాత షూటింగ్‌కు సిద్ధమయ్యారు.
అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ మేకప్ వేసుకుని షూటింగ్ కోసం రెడీ అవుతున్న సమయంలో దర్శకుడు కోదండరామిరెడ్డిని పాట వినిపించమని అడిగారు. పాట ప్లే చేసిన తర్వాత అందులోని సాహిత్యాన్ని విన్న ఏఎన్ఆర్ మాత్రం సంతృప్తి చెందలేదట. పాటలోని కొన్ని పదాలు, లిరిక్స్ తన తెరపై కనిపించే ఇమేజ్‌కు సరిపోవని ఏఎన్ఆర్ భావించారట. ముఖ్యంగా తన సినిమాలను కుటుంబ ప్రేక్షకులు చూస్తారని, తనకు పెద్ద సంఖ్యలో మహిళా అభిమానులు ఉన్నారని ఆయన దర్శకుడికి చెప్పినట్లు జయకుమార్ గుర్తుచేశారు.
తనపై ఆ పాటను చిత్రీకరిస్తే ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే విషయాన్ని కూడా ఏఎన్ఆర్ ఆలోచించారట. దీంతో ఆ పాటకు బదులుగా మరో పాటను పెట్టాలని సూచించారు. ఏఎన్ఆర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ రోజు జరగాల్సిన షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. చివరకు ‘గోపాలకృష్ణుడు’ సినిమాలో ఆ పాటను తొలగించారు. దాని స్థానంలో మరో పాటను రికార్డు చేసి, ఏఎన్ఆర్‌పై కేరళలో చిత్రీకరించినట్లు జయకుమార్ వెల్లడించారు. అయితే కోదండరామిరెడ్డి వద్ద అప్పటికే రికార్డు చేసి ఉన్న “ఇదేమిటబ్బా” పాటను మాత్రం వృథాగా వదిలేయాలని ఆయన అనుకోలేదు. అప్పటికే అందులోని ట్యూన్, సాహిత్యం సిద్ధంగా ఉండటంతో.. ఆ పాటకు సరైన హీరో ఎవరనే ఆలోచన మొదలైంది. అదే సమయంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఖైదీ’ సినిమాకు ఈ పాటను ఉపయోగించాలని నిర్ణయించారు. ‘ఖైదీ’ సినిమాలో ఈ పాటను చిరంజీవిపై చిత్రీకరించారు. తెరపై చిరంజీవి ఎనర్జీ, డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌కు పాట అద్భుతంగా సరిపోవడంతో ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. చిరంజీవి ఖాతాలో మాత్రం ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఒక హీరో తిరస్కరించిన పాట మరో హీరో కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్‌గా మారడం అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.