
మేఘనా రాజ్.. ఈ పేరు వింటే పెద్దగా గుర్తు పట్టుకపోవచ్చు.. కానీ .. 2009లో బెండు అప్పారావు సినిమా హీరోయిన్ అంటే ఒక అందమైన రూపం కళ్ల ముందు మెదులుతుంది. అందులో కామ్న జెఠ్మలానీ మొదటి హీరోయినే అయినా మేఘనా రాజ్ దే కీలక పాత్ర. ఈ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయమైంది మేఘనా రాజ్. మొదటి సినిమాలోనే తనదైన అందం, అభియనంతో ఆకట్టుకుంది. దీని తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన లక్కీ సినిమాలోనూ కథానాయికగా చేసిందీ అందాల తార. అయితే దీని తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తమిళం, మలయాళం భాషల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. ఇదే క్రమంలో తనతో కలిసి నటించిన కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి చేసుకుంది మేఘన. ఈ చిరంజీవి సర్జా మరెవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు స్వయానా మేనల్లుడు అవుతాడు. అలాగే ఇప్పుడు కన్నడలో మాస్ హీరోగా వెలుగొందుతోన్న ధ్రువ్ సర్జాకు చిరంజీవి సొంత అన్న అవుతాడు.
సుమారు పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన మేఘన, చిరంజీవి 2018 మేలో పెళ్లి పీటలెక్కారు. తమ పండంటి కాపురానికి ప్రతీకగా ఒక బిడ్డను కూడా తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు రెడీ అయ్యారు. అయితే కాలం ఈ జంటను చూసి కన్నుకుట్టుకుంది. 2020 జూన్ 7న హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అప్పటికి చిరంజీవి సర్జా వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ఇంకో దురదృష్టకరమైన విషయమేమిటంటే.. చిరంజీవి చనిపోయే నాటికి మేఘనా నిండు గర్భంతో ఉంది. దీంతో ఈ విషాదాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. చాలా రోజుల వరకు బయటకు రాలేదు. అయితే ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో మేఘనా కాస్త మామూలు మనిషి అయ్యింది. చనిపోయిన తన భర్తే కుమారుడి రూపంలో మళ్లీ తిరిగొచ్చాడని సాధారణ జీవితం ప్రారంభించింది. కాగా భర్త చనిపోయాక మళ్లీ సినిమాల్లో నటించలేదు మేఘన. అయితే ఈ మధ్యనే మళ్లీ నటిగా బిజీగా అవుతోంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న జైలర్ 2లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది మేఘన.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి