
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్ 2’ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్లే చేసిన క్యారెక్టర్ ఆడియన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. పార్ట్ 1తో పోలిస్తే ధురంధర్ ది రివేంజ్‌లో లెంత్ పెంచేసారు దర్శక నిర్మాతలు. ఆ పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ, స్వాగ్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి. అయితే తెరపై అంత క్రూరంగా, పవర్‌ఫుల్‌గా కనిపించే ఈ మాస్ పోలీస్ క్యారెక్టర్ దర్శకుడి ఊహల నుంచి పుట్టింది కాదు. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో అండర్‌వరల్డ్‌ను గజగజలాడించిన రియల్ లైఫ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘చౌదరి అస్లాం ఖాన్’ జీవితమే ఈ పాత్రకు ఇన్స్పిరేషన్. 1984లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా డ్యూటీ ఎక్కిన అస్లాం, కరాచీలోని మోస్ట్ డేంజరస్ ఏరియాల్లో పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1990ల కాలంలో కరాచీ సిటీ గ్యాంగ్ వార్స్‌తో నెత్తురోడుతున్న సమయంలో.. రౌడీ షీటర్లను, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను మట్టికరిపించడంలో చౌదరి అస్లాం దే కీ రోల్.
తెల్లటి సల్వార్ కమీజ్ వేసుకుని, చేతిలో సిగరెట్ పట్టుకుని ఏమాత్రం బెదురు లేని ముఖకవళికలతో కనిపించే ఆయన స్టైల్ అప్పట్లో ఒక బ్రాండ్ అంబాసిడర్‌లా మారిపోయింది. ఆయన పేరు చెబితేనే ఉగ్రవాదులు, మాఫియా డాన్లు వణికిపోయేలా తన ఇమేజ్‌ను బిల్డ్ చేసుకున్నాడు. అందుకే అక్కడి మీడియా ఆయనకు పాకిస్తాన్ ‘టఫెస్ట్ కాప్’ అనే బిరుదు కూడా ఇచ్చింది. తన సర్వీస్ మొత్తంలో వందకు పైగా ఎన్‌కౌంటర్ ఆపరేషన్లలో పాల్గొన్న ఈ డాషింగ్ ఆఫీసర్.. లియారీ ప్రాంతంలో చెలరేగిన గ్యాంగ్ వార్స్‌ను, పాక్ తాలిబన్ల అరాచకాలను ఉక్కుపాదంతో అణచివేశాడు. నేరస్థులను అరెస్ట్ చేసి కోర్టుల చుట్టూ తిప్పడం కంటే, స్పాట్‌లోనే లేపేయడమే కరెక్ట్ అనేది అస్లాం ఖాన్ ఫిలాసఫీ. డైరెక్టర్ ఆదిత్య ధర్ ‘ధురంధర్’ సినిమాలో సంజయ్ దత్ క్యారెక్టర్ ద్వారా ఎగ్జాక్ట్‌గా ఇదే పాయింట్‌ను హైలైట్ చేశాడు.
అయితే అస్లాం ప్రయాణం పూల పాన్పులా ఏమీ సాగలేదు, ఆయన చుట్టూ బోలెడన్ని వివాదాలు అల్లుకుని ఉన్నాయి. ఆయన చేసిన వాటిలో చాలావరకు బూటకపు ఎన్‌కౌంటర్లని, అమాయకుల ప్రాణాలు కూడా తీశాడని మానవ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడేవి. ఈ ఆరోపణల నేపథ్యంలో 2006లో జైలు శిక్ష కూడా అనుభవించిన ఆయన.. ఆ తర్వాత క్లీన్ చిట్‌తో బయటపడ్డాడు. ఎన్ని విమర్శలు వచ్చినా ఉగ్రవాదుల పాలిట మాత్రం ఆయనో మృత్యువులాగే మారాడు. అస్లాం ఖాన్‌ను అడ్డు తొలగించుకునేందుకు తాలిబన్ ఉగ్రవాదులు పన్నిన పన్నాగాలు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా తొమ్మిది సార్లు ఆయనపై హత్యాయత్నాలు జరిగినా ప్రాణాలతో బయటపడ్డాడు. ఒకానొక సందర్భంలో ఆయన సొంతింటి పైనే తీవ్రవాదులు బాంబుల వర్షం కురిపించారు.
ఆ దాడిలో ఇల్లు కుప్పకూలినా.. ఆ శిథిలాల మధ్య నుంచే బయటకొచ్చి “ఒక్క ఉగ్రవాదిని కూడా వదిలిపెట్టను” అంటూ మీడియాతో చేసిన శపథం ఆయనలోని తెగింపును తెలియజేస్తుంది. తనను చంపాలనుకున్న వాళ్లందరికీ ఎదురొడ్డి నిలిచిన అస్లాం ధైర్యం చూసి అప్పట్లో యావత్ దేశం ఆశ్చర్యపోయింది. చావును ఇన్నిసార్లు మోసం చేసిన ఈయన్ని 2014 జనవరి 9న మాత్రం విధి వెన్నుపోటు పొడిచింది. కరాచీలోని లియారీ ఎక్స్‌ప్రెస్ వే మీద ఆయన కాన్వాయ్ వెళ్తున్న టైమ్‌లో తాలిబన్లు పక్కా స్కెచ్‌తో భారీ బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ భయంకరమైన పేలుడులో అస్లాం ఖాన్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ధురంధర్ 2లో ఈ సీన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈ దాడికి తామే కారణమంటూ తాలిబన్లు ప్రకటించుకున్నారు. గన్‌తోనే తన సామ్రాజ్యాన్ని శాసించి, చివరికి అదే గన్‌కి బలైన ఈ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఏ సినిమా హీరో కథకూ తీసిపోదు. ఆ రియల్ లైఫ్ క్యారెక్టర్‌లోని ఫైర్ వల్లే ఇప్పుడు ‘ధురంధర్’ సినిమాలో సంజయ్ దత్ అంతలా విశ్వరూపం చూపించగలిగాడు.
Also Read: మహానటి సావిత్రి చివరి రోజులు: ఒక విషాద గాథ