
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా మెగాస్టార్ చిరంజీవి కొత్త టాక్ షో గురించే చర్చ నడుస్తోంది. దశాబ్దాలుగా వెండితెరపై తనదైన ముద్ర వేసిన చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘చిరంజీవి మెగావర్స్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ షోపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఇందులో సందడి చేయబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ టాక్ షోలో ప్రభాస్ పాల్గొనబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజా సమాచారం ప్రకారం.. నవంబర్ 20న చిరంజీవి, ప్రభాస్‌లకు సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు, ఈ ఎపిసోడ్‌లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా పాల్గొనే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురి కలయిక మరింత ప్రత్యేకంగా మారనుంది. అయితే ఈ అతిథుల వివరాలను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చిరంజీవి అంటే ప్రభాస్‌కు ఎంతో గౌరవం. మెగాస్టార్‌పై తనకున్న అభిమానాన్ని ప్రభాస్ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పుడు వీరిద్దరూ ఒకే వేదికపై కూర్చుని మాట్లాడుకుంటే అభిమానులకు అంతకంటే పెద్ద ఆనందం ఏముంటుంది.? ప్రభాస్ తన సినీ ప్రయాణం, స్టార్‌డమ్, వ్యక్తిగత అనుభవాలు, అలాగే తన కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు వెల్లడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మెగావర్స్‌లో కేవలం ఒక్కరిద్దరు స్టార్ హీరోలే కాకుండా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, నాగార్జున మధ్య ఉన్న స్నేహం, సినిమా ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలు ఈ ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ఇక ఇతర సినీ ప్రముఖులు కూడా ఈ షోలో పాల్గొనే అవకాశముండటంతో గెస్ట్ లిస్ట్‌పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో రూపొందిస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్ఎల్‌పీ సంస్థలు ఈ షో నిర్మాణంలో భాగమయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి