
తెలుగు సినిమా ప్రేక్షకులు కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హనుమాన్ అంశ్. ఈ సినిమా తెలుగు రిలీజ్‌కు ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. హిందీ బాక్సాఫీస్ దగ్గర ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన ఈ ఆధ్యాత్మిక చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ రిలీజ్ డేట్ ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన పోటీకి తెరతీసింది. హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఇన్నాళ్లుగా కొనసాగుతున్న తెలుగు రిలీజ్ సస్పెన్స్‌కు తెరపడింది.
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ నీమ్ కరోలి బాబా జీవితంలోని ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా రూపొందిన సినిమా. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు లేకుండానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. సుమారు రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం. ముఖ్యంగా ప్రారంభంలో నెమ్మదిగా సాగిన కలెక్షన్లు.. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో భారీగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ విషయంలో ముందుగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపించింది. ఆయనకు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకురావాలని అప్పట్లో ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 18న తెలుగు వెర్షన్‌ను విడుదల చేయాలనే ఆలోచన కూడా జరిగింది. హైదరాబాద్‌లో టీజర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి కార్యక్రమాలకు ఏర్పాట్లు జరిగినప్పటికీ.. చివరి నిమిషంలో అవి రద్దయ్యాయి. ఆ తర్వాత తెలుగు రిలీజ్ ప్లాన్ కూడా మారిపోయింది. అయితే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నారనే విషయంలో అధికారికంగా స్పష్టమైన కారణం వెల్లడికాలేదు. ఆదర్శ కుటుంబం కారణంగానే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
త్రివిక్రమ్ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ బాధ్యతలు తీసుకుంది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ.. అక్టోబర్ 9న తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హిందీ వెర్షన్‌కు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లో హోంబలే ఫిల్మ్స్ భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు తెలుగు మార్కెట్‌లోకి కూడా అదే సంస్థ సినిమాను తీసుకురావడం ఆసక్తిని పెంచుతోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అక్టోబర్ 9న ‘హనుమాన్ అంశ్’ విడుదల కానుండగా.. అదే రోజున త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం AK47’ కూడా థియేటర్లలోకి రానుంది. మొదట అక్టోబర్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఆ తర్వాత వారం రోజులు వాయిదా పడి అక్టోబర్ 9కి షిఫ్ట్ అయింది. దీంతో ఒకప్పుడు త్రివిక్రమ్ ఆధ్వర్యంలో తెలుగులోకి రావాల్సిన ‘హనుమాన్ అంశ్’.. ఇప్పుడు త్రివిక్రమ్-వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాతోనే ఒకే రోజు బాక్సాఫీస్ పోటీకి దిగుతోంది. ‘హనుమాన్ అంశ్’కు ఇప్పటికే హిందీలో భారీ విజయంతో వచ్చిన క్రేజ్ ఉంది. మరోవైపు ‘ఆదర్శ కుటుంబం’పై త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ కారణంగా టాలీవుడ్‌లో అంచనాలు ఉన్నాయి.ఒకవైపు ఇప్పటికే హిట్ టాక్‌తో తెలుగు మార్కెట్‌లోకి వస్తున్న ‘హనుమాన్ అంశ్’.. మరోవైపు కొత్త కంటెంట్‌తో థియేటర్లలోకి రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడంతో అక్టోబర్ 9న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర ఆసక్తికరమైన పోటీ కనిపించే అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.