
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’ రియాలిటీ షో షూటింగ్ సమయంలో
భాగంగా ప్రమాదవశాత్తూ ఆయన కింద పడ్డారు. దీంతో బిగ్ బీకి మోకాలికి గాయమైంది. ఈ విషయాన్ని బిగ్ బీనే స్వయంగా ఆ షో తాజా ఎపిసోడ్‌లో వెల్లడించారు. సాధారణంగా కేబీసీ షో ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ వేదిక మధ్యలో నిలబడి ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు , కానీ ఈసారి గాయం కారణంగా ఆయన కూర్చొని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎపిసోడ్ ప్రారంభంలో, వేదిక వద్దకు అక్కడి సీటులో కూర్చున్న అమితాబ్, ఆ సంఘటనను వివరిస్తూ, ‘సాధారణంగా నేను వేదిక మధ్యలో నిలబడి నా ప్రారంభోపన్యాసం ఇస్తాను. కానీ ఈరోజు నా మోకాలికి గాయమైంది. నిన్న షూటింగ్ చేస్తుండగా జారిపడి నా ఎడమ మోకాలికి దెబ్బ తగిలింది’ అని చెప్పుకొచ్చారు.
బిగ్ బి గాయపడ్డారన్న వార్త విన్న వెంటనే సెట్‌లోని ప్రేక్షకులు కంగారుపడ్డారు. కానీ అమితాబ్ వెంటనే ప్రేక్షకులను ఓదార్చుతూ, ‘గాయం అంత తీవ్రమైనది కాదు. పోటీదారులను వేదికపైకి ఆహ్వానించేటప్పుడు నేను నిలబడతాను. కానీ ప్రస్తుతం, నిలబడటానికి కొంచెం కష్టంగా ఉన్నందున కూర్చుంటున్నాను’ అని అన్నారు. దీంతో కేబీసీ కంటెస్టెంట్స్, ప్రేక్షకులు బిగ్ బీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
83 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ చురుకుగా ఉంటున్నారు అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం ఆయన పెద్ద ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సెక్షన్ 84’ అనే కోర్ట్‌రూమ్ డ్రామాలో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఇందులో డయానా పెంటీ, నిమ్రత్ కౌర్, అభిషేక్ బానర్జీ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఇది కాకుండా ప్రభాస్- నాగ్ అశ్విన్ సూపర్ హిట్ ‘కల్కి 2898 AD’ రెండవ భాగంలో అమితాబ్ అశ్వత్థామ పాత్రను కొనసాగించనున్నారు. ఈ చిత్రంలో ఆయన ప్రభాస్, కమల్ హాసన్‌లతో కలిసి కనిపించనున్నారు. ‘ఆంఖేన్ 2’ చిత్రంలో కూడా బిగ్ బి నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.