
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ గేమ్ షోలోనూ ఈ అమ్మడు సందడి చేసింది. తాజాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది మోనాల్. తనకు పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ సోకినట్లు, ఇటీవలే సర్జరీ చేయించుకున్నట్లు మోనాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపింది. ఈ సందర్భంగా తన ఆరోగ్య ప్రయాణం గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకుంది.
మోనాల్ గజ్జర్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేశ్ హీరోగా నటించిన సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి చిత్రాల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది. ఇక తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించి అలరించింది. తాజాగా తన ఆరోగ్య సమస్య గురించి మోనాల్ చేసిన పోస్ట్ సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. తనకు పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారని ఆమె వెల్లడించింది. దీంతో వైద్యుల సూచన మేరకు సర్జరీ చేయించుకున్నట్లు తెలిపింది. అదృష్టవశాత్తూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతోందని పేర్కొంది.
ఈ సందర్భంగా మోనాల్ తన అభిమానులకు కీలక సందేశం ఇచ్చింది. కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించింది. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని కోరింది. అంతేకాకుండా సర్వైకల్ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను కూడా గుర్తుచేసింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన మోనాల్.. ఆమె త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి