
సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష (43) ఇటీవల ఉదయం పూట ఎండలో నిలబడి సూర్య రశ్మిని ఆస్వాదిస్తూ కనిపించింది. అనంతరం ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ‘విటమిన్ డీ కోసం కాస్త సన్ టైమ్’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీని గురించి ఆమె ఎక్కువ వివరాలు చెప్పకపోయినా, 40 ఏళ్ల వయసులో విటమిన్ డి వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ’40 ఏళ్ల వయసులో ఎముకలు, కండరాలు, జీవక్రియ ఆరోగ్యాలలో సూక్ష్మ మార్పులు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం కాల్షియంను గ్రహించడానికి విటమిన్ డి సహాయపడుతుంది. ఎముకల బలాన్ని, కండరాల పనితీరును నిర్వహించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగే కొద్దీ, సరైన విటమిన్ డీ స్థాయిలను నిర్వహించడం చాలా అవసరం. ఎందుకంటే ఎముకల క్షీణత, కండరాల తగ్గింపు క్రమంగా బలహీనత, పడిపోవడం, పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి’ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సూర్యరశ్మి సరిపోతుందా?
సూర్యరశ్మి విటమిన్ డి ఉత్పత్తికి దోహదపడుతుంది, కానీ అందరికీ ఒకే మోతాదులో సరిపోదు. చర్మ రకం, వయసు, రుతువు, దుస్తులు, ప్రదేశం, వాయు కాలుష్యం, బహిర్గతమయ్యే చర్మం పరిమాణం, ఇవన్నీ ప్రభావం చూపుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ‘కేవలం ఎండలో కూర్చోవడం వల్ల మీ విటమిన్ డి అవసరాలు తీరుతాయని కాదు. లోపం ఉందని అనుమానిస్తే, రక్త పరీక్ష, వైద్య సలహాలు మాత్రమే నమ్మదగినవి. కేవలం సూర్యరశ్మి ద్వారా ఎంత విటమిన్ డి లభిస్తుందో అంచనా వేయలేం’ అని డాక్టర్లు చెబుతున్నారు.
విటమిన్ డి లోపం లక్షణాలు ఏమిటి?
విటమిన్ డి లోపానికి కచ్చితమైన లక్షణాలు కనిపించకపోవచ్చు.. ‘తక్కువ లోపం చాలా కాలం పాటు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండవచ్చు. కొందరు కండరాల నొప్పి, ఎముకల అసౌకర్యం, బలహీనత లేదా అలసటను అనుభవించవచ్చు. అయితే ఈ లక్షణాలు విటమిన్ డి లోపానికి మాత్రమే పరిమితం కావు. వాటికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అందుకే కేవలం అలసిపోయినట్లు అనిపిస్తే అధిక మోతాదులో సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది కాదు. ఇక తగినంత ప్రొటీన్ తీసుకోకపోవడం, తక్కువ శారీరక శ్రమ, సరిపడని సూర్యరశ్మి, ఇవన్నీ కండరాల, ఎముకల ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటన్నిటికీ విటమిన్ డి ఒక్కటే పరిష్కారం కాదు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, తగినంత కాల్షియం, ప్రొటీన్ తీసుకోవడం, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం కూడా అంతే ముఖ్యం’ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. లోపం ఉందని నిర్ధారించినప్పుడు లేదా వైద్యులు నిర్దిష్ట ప్రమాదాన్ని గుర్తించినప్పుడు మాత్రమే సప్లిమెంట్లు ఉపయోగపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ‘అధికంగా విటమిన్ డి తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. అసాధారణంగా అధిక కాల్షియం స్థాయిలు దీనికి ఉదాహరణ. వయసు ఆధారంగా మాత్రమే సప్లిమెంట్స్ తీసుకోవడం కంటే, మన శరీరానికి ఏది అవసరమో అదే తీసుకోవాలి. అలాగే ఈ విషయంలో ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి’ అని డాక్టర్లు సూచిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.