
మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేశ్. మరోసారి విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అందాల భామ. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన డోరతిలో ఆమె టైటిల్ రోల్ పోషించింది. సనంత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి చర్చకు దారితీసింది. తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా ఈ చిత్రం వచ్చింది. సాధారణ కమర్షియల్ పాత్రలకు భిన్నంగా డోరతిలో తన పాత్ర ఉండటంతో ఈ సినిమాపై కీర్తి సురేశ్ ఫ్యాన్స్ మంచి అంచనాలు పెంచుకున్నారు. సినిమా విడుదల సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా తన అనుభూతులను అభిమానులతో పంచుకుంది. డోరతి తన మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందని కీర్తి తెలిపింది. ఈ పాత్రను ప్రేక్షకులు కూడా ఆదరించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. తనపై, సినిమాలోని పాత్రపై నమ్మకం ఉంచిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. అలాంటి దర్శకుడి సినిమాలో కీలక పాత్ర చేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది ఈ చిన్నది. తాను ఎంతో ఇష్టపడే చిత్ర బృందంలో భాగం కావడం ఒక కల నిజమైన అనుభూతిని ఇచ్చిందని కీర్తి పేర్కొంది. డోరతికి మరో ప్రధాన ఆకర్షణ సంగీతం. లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం కీర్తి సురేశ్‌కు ప్రత్యేక అనుభూతిని కలిగించిందని పేర్కొంది. ఇళయరాజా సృష్టించిన సంగీత ప్రపంచంలో తాను కూడా భాగం కావడం ఊహించని అనుభవమని, ఇది కలలో కూడా ఊహించలేదు అని కీర్తి చెప్పుకొచ్చింది.
ఒకవైపు కార్తీక్ సుబ్బరాజ్ వంటి దర్శకుడితో పనిచేసే అవకాశం, మరోవైపు ఇళయరాజా సంగీతంలో భాగం కావడం తన కెరీర్‌లో గుర్తుండిపోయే అనుభవంగా కీర్తి పేర్కొంది. డోరతితో ప్రేక్షకులను పలకరించిన కీర్తి సురేశ్ ప్రస్తుతం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న సత్యవాన్ సావిత్రి చిత్రం నవంబర్ 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ లాయర్ పాత్రలో కనిపించనుంది. గత చిత్రాలకు భిన్నంగా ఉండే ఈ పాత్రపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకురానున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.