
తమిళ చిత్ర పరిశ్రమలో నటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం కొత్తేమీ కాదు. గతలో ఎంజీఆర్, విజయ్ కాంత్, శరత్ కుమార్ సహా ఎందరో నటులు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఇక నేటి తరం హీరోల్లో దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి పెద్ద సంచలనమే సృష్టించారు. ఇప్పుడు ఆయన ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా పీఠం అధిష్టించారు. వీరే కాకుండా ధనుష్, శివ కార్తికేయన్, సూర్య.. ఇలా చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి రానున్నారని తమిళనాట ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటికే ధనుష్ క్లారిటీ ఇవ్వగా తాజాగా హీరో సూర్య కూడా పాలిటిక్స్ ఎంట్రీపై స్పందించారు. తన రీసెంట్ సినిమా సీన్ ప్రమోషన్స్ సందర్భంగా రాజకీయాల గురించి సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . తాను కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానన్న ఊహాగానాలన్నింటికీ తెరదించారీ స్టార్ హీరో. అసలు తనకు రాజకీయాల్లోకి ప్రవేశించే ప్రణాళికలు లేవని సూర్య స్పష్టం చేశారు. అయితే తాను రాజకీయ పరిణామాలను చాలా సున్నితంగా, నిశ్శబ్దంగా గమనిస్తున్నానని ఆయన చెప్పారు. రాజకీయాలపై పూర్తి అవగాహన, స్పష్టతతో యువత రాజకీయ రంగంలోకి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని విద్యా వ్యవస్థకు రాజకీయ నాయకులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూర్య అభిప్రాయపడ్డారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ పూర్తి అంకితభావంతో రాజకీయ రంగంలోకి ప్రవేశించాచి ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మొన్నటివరకు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు సూర్య. భారీ అంచనాలతో రిలీజైన కంగువా, రెట్రో సినిమాలు కూడా సూర్యకు తీవ్ర నిరుత్సాహాన్ని మిగిల్చాయి. అయితే 2026 సంవత్సరం మాత్రం సూర్యకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన నటించిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రిలీజైన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా రిలీజైన సీన్ కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటకే రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దర్శకుడు జీతూ మాధవన తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య సరసన నజ్రియా హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రేమలు హీరో నస్లేన్ విలన్ పాత్రలో అదరగొట్టాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి