
ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద అత్యథిక వసూళ్లు సాధించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా 777 చార్లీ (777 Charlie). కిరిక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 777 చార్లీ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి ఎమోషనల్ అయ్యారు.. ముఖ్యంగా ఈ మూవీ చూసి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సైతం కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. చార్లీ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.. తాజాగా ఈ సినిమా చూసి సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం హీరో రక్షిత్ శెట్టిపై ప్రశంసలు కురింపించారట.. ఈ విషయాన్ని హీరో రక్షిత్ శెట్టి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు..
” ఈరోజు చాలా అద్భుతంగా ప్రారంభమైంది.. సూపర్ స్టార్ రజినీకాంత్ సర్ నుంచి కాల్ వచ్చింది.. ఆయన గత రాత్రి 777 చార్లీ సినిమాను చూశారు.. సినిమా మేకింగ్, క్వాలిటీ.. తెరకెక్కించిన విధానం.. క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు బాగుందని మెచ్చుకున్నారు.. ఆధ్యాత్మిక కోణంలో క్లైమాక్స్ తెరకెక్కించడం బాగుంది.. సూపర్ స్టార్ నుంచి ఇలాంటి మాటలు వినడం అద్భుతంగా ఉంది.. రజినీకాంత్ సర్ కు ధన్యవాదాలు” అంటూ ట్వీ్ట్ చేశారు రక్షిత్ శెట్టి.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక వ్యక్తికి, చార్లి అనే కుక్కకు మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని చక్కగా, హృద్యంగా ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు కె. కిరణ్ రాజ్. కన్నడతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న ఈ సినిమా విడుదలైంది.
ఇదిలా ఉంటే..ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు వినిపిస్తోంది. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆగస్టు రెండో వారం నుంచి డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులో రానుందని సమాచారం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.