
ప్రభాస్ తన కెరీర్ ప్రారంభించి ఈశ్వర్ చిత్రంతో తెరంగేట్రం చేసినప్పుడు, అతను కేవలం ఒక హీరోగానే కాకుండా, తన పాత్ర కోసం పూర్తి అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా నిరూపించుకున్నాడని నటుడు కృష్ణమాయ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్ కోసం పడిన కఠోర శ్రమ, అతని అంకితభావం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు కృష్ణమాయ. అలాగే కృష్ణ మాయ మాట్లాడుతూ.. ప్రభాస్ సత్యానంద్ గారి శిక్షణలో చేరినప్పుడు, సాధారణ పిల్లవాడిలా, మంచి ఆహారం తీసుకుని కాస్త బొద్దుగా ఉండేవాడు. అక్కడ చిరంజీవి అనే ట్రైనర్ ప్రభాస్‌కు బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ బాధ్యతలను తీసుకున్నారు. ప్రతి ఉదయం బీచ్‌కు తీసుకెళ్లి, మైళ్ళ దూరం పరిగెత్తించేవారు. అల్పాహారంగా ఇడ్లీ, సాంబార్ కాకుండా కేవలం ఒక రొట్టె ముక్క మాత్రమే ఇచ్చేవారు. ఇలాంటి కఠినమైన డైట్, వర్కవుట్స్ వల్ల ప్రభాస్ మూడు, నాలుగు నెలల్లోనే చాలా సన్నబడ్డాడు. తన కొడుకును చూసి ప్రభాస్ తల్లిదండ్రులు, “మా అబ్బాయిని చంపేస్తారా.?” అని ఆందోళన వ్యక్తం చేశారట. అప్పుడు ట్రైనర్ చిరంజీవి, “రెండు నెలలు ఆగండి, అప్పుడు మీరు చూడండి” అని చెప్పి, ప్రభాస్‌ను ఈశ్వర్ సినిమాలో కనిపించే విధంగా తీర్చిదిద్దారు. ఈశ్వర్ చిత్రంలోని ఓ పోస్టర్ ఒకటి ఉంది – ప్రభాస్ చేతులు చాపి హీరోయిన్‌ను ఎత్తుకున్నది. అది ఒక అందమైన పాట చిత్రీకరణకు సంబంధించిన సన్నివేశం. ఆ పాట కోసం గాంధీపేట సమీపంలోని ఒక బురద చెరువును చిత్ర బృందం శుభ్రం చేయించి, కొత్త నీటిని పోసి అందంగా మార్చారు.
ఇక, “అమీర్‌పేటకా ధూల్‌పేటకా” పాట చిత్రీకరణ ఛార్మినార్ వద్ద జరిగింది. ఆ ప్రాంతంలో జనసందోహం ఎక్కువ కాబట్టి, సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ చేయడానికి పర్మిషన్ లభించలేదు. ప్రభాస్ సౌండ్ లేకుండానే డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. డీసీఎంలో ఉన్న చిత్ర బృందం కెమెరాను పెట్టుకొని, పసుపు రంగు వస్త్రంతో సిగ్నల్స్ ఇస్తూ ప్రభాస్‌ను డ్యాన్స్ చేయమనేవారట. నేటి స్టార్‌డమ్ ఉన్న ప్రభాస్ ఆ ప్రాంతంలో ఇప్పుడు డ్యాన్స్ చేయాలంటే, మొత్తం ఛార్మినార్ సెట్ వేయాల్సిందే తప్ప అది సాధ్యమయ్యే పని కాదని కృష్ణమాయ చెప్పారు. ఈ సంఘటనలు ప్రభాస్ తొలి రోజుల్లో పడిన కష్టాలు, ప్రదర్శించిన సహనానికి నిదర్శనం.
ప్రభాస్ ఇప్పటికీ ఆహార ప్రియుడు అని, ఇంటికి వెళ్తే మంచి ఆహారం పెట్టి చంపేస్తాడని కృష్ణమాయ సరదాగా అన్నారు. అలాంటి వ్యక్తికి ఫిట్‌గా ఉండటానికి ఎంత నిగ్రహం ఉండాలో ఊహించవచ్చన్నారు. డైలాగ్ చెప్పేటప్పుడు, తన పెదనాన్న కృష్ణంరాజు గారు ఎలా చెబుతారో, తాను ఎలా చెబుతానో మిక్స్ చేసి, తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా చెప్పేవారని, డైలాగ్స్ సమయంలో అందరి సలహాలు తీసుకునేవారని కృష్ణమాయ గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ చాలా సిగ్గుపడే స్వభావం కలవారని, సీన్ లో అమ్మాయిని కౌగిలించుకోవాలన్నా దూరంగా ఉండేవాడని తెలిపారు. అలాగే కృష్ణమాయ మాట్లాడుతూ.. ఇటీవల ఒక ఫౌజీ సెట్‌లో ప్రభాస్‌ను కలిసినప్పుడు, ప్రభాస్ బాహుబలి అంతటి పెద్ద స్టార్ కాబట్టి, దగ్గరికి వెళ్లడానికి తటపటాయించారట. కానీ ప్రభాస్ స్వయంగా దగ్గరికి వచ్చి, ఆప్యాయంగా పలకరించి, గంటసేపు చేయి వదలకుండా ఈశ్వర్ రోజుల గురించి మాట్లాడారట. ఈశ్వర్ ప్రభాస్ నుండి బాహుబలి ప్రభాస్ వరకు ఆయన ఎదిగిన తీరు, తన తొలి రోజుల జ్ఞాపకాలను గౌరవించే తీరు అందరికీ ఆదర్శం అని కృష్ణ మాయ చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి