ప్రస్తుతం తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్ రియాల్టీ షో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ షోకు అన్ని భాషల్లోనూ టీఆర్పీ రేటింగ్ ఎక్కువగానే ఉంది. అయితే బిగ్‌బాస్ హౌస్ లో కంటెస్టెంట్లకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. షోలో బూతులు మాట్లాడకూడదు.. ఒకరిపై మరొకరు దాడి చేసుకోకూడదు ఇలాంటి రూల్స్ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కంటెస్టెంట్స్ హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ఇక మరికొందరు మాత్రం తమ నోటికి పని చేప్పేస్తారు. అయితే బిగ్‌బాస్ హౌస్ లో గొడవలు తెలుగు షోలో కాస్త తక్కువే ఉంటాయి. గతంలో హిందీ బిగ్‌బాస్ షోలో గొడవలు కావడం.. కంటెస్టెంట్లను మధ్యలోనే ఎలిమినేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కన్నడ షోలో ఎక్కువగా వివాదాలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్‌బాస్ కన్నడ సీజన్ 10లో పాల్గొంటున్న కంటెస్టెంట్ నటి తనీషా కుప్పండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద్ ఎఫ్ఐఆర్ నమోదైంది.
కన్నడ బిగ్‌బాస్ సీజన్ 10కి నటుడు సుధీప్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల నవంబర్ 8న ప్రసారమైన షోలో.. నటి తనీషా కుప్పండ తన తోటి కంటెస్టెంట్ డ్రోన్ ప్రతాప్‌ను ‘వడ్డా’ అని పిలిచింది. దీంతో అఖిల కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు భోవి సమాజ్ పి పద్మ బెంగళూరు శివార్లలోని కుంబళగోడు పోలీస్ స్టేషన్లో నటి తనీషాపై ఫిర్యాదు చేశారు. తానీషా భోవి కమ్యూనిటీని కించపరిచే విధంగా మాట్లాడారని పద్మ ఆరోపించింది. తనీషాతోపాటు సదరు టీవీ ఛానెల్ పై పోలీసు కేసు పెట్టింది. ఈ క్రమంలోనే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదవడంతో, తనీషా బిగ్ బాస్ హౌస్ నుండి కొంతకాలం ఎవిక్షన్ కావడం లేదా డైరెక్ట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
‘వడ్డా’ అనేది షెడ్యూల్డ్ కులాల విభాగంలోకి వచ్చే భోవి సంఘంలో ఓ భాగం. ఇప్పటికే బిగ్‌బాస్ షోలో ఇలా భోవి వర్గాన్ని కించపరుస్తూ కామెంట్స్ చేయడం ఇది రెండోసారి. గత సీజన్ లో నటుడు సిహి కహీ చంద్రు కూడా ఇదే పదాన్నీ ఉపయోగించాడు. కానీ ఆ తర్వాత అతనుడ క్షమాపణలు చెప్పాడని పద్మ గుర్తుచేశారు. ఇక బిగ్‌బాస్ సీజన్ 10 ప్రారంభంలోనే మరో కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్ పులి గోరు లాకెట్ ధరించినందుకు అతడిని షో మధ్యలోనే అరెస్ట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.