ఓటీటీలో అదరగొడుతున్న రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి.. ఎక్కడ చూడోచ్చంటే
ఓటీటీల్లో క్రైమ్ స్టోరీస్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటోంది. అందులోనూ ఇతర భాషల్లో విడుదలైన సినిమాలైతే మరీ డిమాండ్ ఉంటోంది. అందుకే అక్కడ హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను డబ్బింగ్ చేసి మరీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు.

ఓటీటీలో సినిమాలు చూసే ప్రేక్షకుల్లో క్రైమ్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటాయి. అలాంటి ఓ వాస్తవ ఘటనను ఆధారంగా చేసుకుని రూపొందిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే ఇప్పుడు ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. ఈ సినిమా మరేదో కాదు బాలీవుడ్ లో తెరకెక్కిన భక్షక్. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఒక భయంకరమైన నేరం వెనుక దాగి ఉన్న నిజాలను వెలికితీసేందుకు ఓ మహిళా జర్నలిస్ట్ చేసే పోరాటాన్ని చూపిస్తుంది. ఎమోషన్స్, ఉత్కంఠ, సామాజిక బాధ్యత కలగలిపిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 2018లో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉన్న బాలికల షెల్టర్ హోమ్‌లో మైనర్ బాలికలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో బయటపడిన భయంకరమైన నిజాలు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ వాస్తవ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు పుల్కిత్ ‘భక్షక్’ సినిమాను తెరకెక్కించారు. అయితే సినిమాలో నిజ జీవితంలోని ప్రాంతం పేరును ‘మునవ్వర్‌పూర్’గా మార్చి కథను ఆవిష్కరించారు.
ఈ సినిమా కథ వైశాలి సింగ్ అనే ఓ స్థానిక జర్నలిస్ట్ చుట్టూ తిరుగుతుంది. చిన్న న్యూస్ ఛానెల్‌లో పనిచేసే వైశాలి (భూమి పెడ్నేకర్)కు ఒక బాలికల సంరక్షణ కేంద్రంలో అమానుష ఘటనలు జరుగుతున్నాయనే విషయం తెలుస్తుంది. అక్కడి మైనర్ బాలికలు తీవ్ర వేధింపులకు గురవుతున్నారనే అనుమానంతో ఆమె నిజానిజాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతుంది. తన కెమెరామెన్ భాస్కర్ సిన్హా (సంజయ్ మిశ్రా) సహాయంతో ఆ షెల్టర్ హోమ్‌కు సంబంధించిన వివరాలను సేకరించడం ప్రారంభిస్తుంది. అయితే ఆ కేంద్రాన్ని నడిపించే బన్సీ సాహు అనే వ్యక్తికి రాజకీయంగా మంచి పలుకుబడి ఉంటుంది. డబ్బు, అధికారం, రాజకీయ సంబంధాలను ఉపయోగించుకుని తన అకృత్యాలు బయటపడకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఈ క్రమంలో వైశాలికి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. బెదిరింపులు, ఒత్తిళ్లు, వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఆమెను వెనక్కి తగ్గించే ప్రయత్నం చేస్తాయి. అయినప్పటికీ ఆమె తన ప్రయత్నాన్ని ఆపదు. షెల్టర్ హోమ్‌లో పనిచేసే వంటమనిషి సుధ అందించే కీలక సమాచారం, నిజాయితీగల పోలీసు అధికారి సహాయంతో కేసు వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు బాధిత బాలికలకు న్యాయం జరిగేలా ఆమె చేసిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే మిగతా కథ.
ఈ సినిమాలో వైశాలి సింగ్ పాత్రలో భూమి పెడ్నేకర్ అద్భుతంగా నటించారు. ఒక సాధారణ జర్నలిస్ట్‌గా కనిపిస్తూనే, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యవంతురాలిగా తన నటనతో ఆకట్టుకున్నారు. మరోవైపు భాస్కర్ పాత్రలో సంజయ్ మిశ్రా తనదైన నటనతో సినిమాకు బలాన్ని అందించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు పుల్కిత్ ఎలాంటి అనవసరమైన కమర్షియల్ హంగులు లేకుండా కథను వాస్తవికంగా తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ‘భక్షక్’ అందుబాటులో ఉంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ ఆఫన్ అనే చెప్పాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
