Nagabhushanam: అసాధారణమైన నటనా కౌశల్యం.. విలనీజానికి కొత్త భాష్యం చెప్పిన విలక్షణ నటుడు నాగభూషణం

| Edited By: Balaraju Goud

Apr 19, 2022 | 12:15 PM

రెండు తరాలను అసాధారణమైన నటనతో మెస్మరైజ్‌ చేశారు. విలనీ డైలాగులకు జనం చప్పట్లు కొట్టడం నాగభూషణంతోనే మొదలయ్యింది.. బహుశా ఆయనతోనే ముగిసింది.

Nagabhushanam: అసాధారణమైన నటనా కౌశల్యం.. విలనీజానికి కొత్త భాష్యం చెప్పిన విలక్షణ నటుడు నాగభూషణం
Nagabhushanam
Follow us on

Chakravarthula Nagabhushanam: ఈ జనరేషన్‌కు నాగభూషణం అంతగా తెలియకపోవచ్చు కానీ, రెండు తరాలను అసాధారణమైన నటనతో మెస్మరైజ్‌ చేశారు. విలనీ డైలాగులకు జనం చప్పట్లు కొట్టడం నాగభూషణంతోనే మొదలయ్యింది.. బహుశా ఆయనతోనే ముగిసింది.. ఆయన ఇంటిపేరు చక్రవర్తుల. కాకపోతే రక్త కన్నీరు నాగభూషణంగానే ఆయన పాపులరయ్యారు. 1921, ఏప్రిల్‌ 19న నెల్లూరులో జన్మించారు నాగభూషణం. పెద్దగా ఆస్తిపాస్తులున్న కుటుంబమేమీ కాదు. అందుకే చిన్నా చితక పనులు చేసి చదువుకున్నారు. హైస్కూల్‌ చదవయ్యాక వేసవి సెలవుల్లో టూర్లు రీ గ్రూపింగ్‌ చేశారు. అలా వచ్చిన డబ్బులతో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశారు.

డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఉన్నత చదువులు చదవడం ఆయన వల్ల కాలేదు. ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టారు. వెతకగా వెతకగా సెంట్రల్‌ కమర్షియల్‌ సూపరింటెండెంట్‌ ఆఫీసులో ఉద్యోగం దొరికింది. మద్రాస్‌లో పోస్టింగ్‌. జీతం నెలకు పాతిక రూపాయలు. మద్రాస్‌కు చేరేవరకు ఆయనకు నాటకాలంటే ఏమిటో తెలియదు. నాగభూషణంలోని నటుడుని బయటకు తీసుకొచ్చినవారు జి.వరలక్ష్మి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. ప్రజానాట్యమండలి ద్వారా వీరిద్దరు నాగభూషణానికి పరిచయం అయ్యారు. వారితో కలిసి ఆత్రేయ రాసిన భయం, కప్పలు వంటి నాటకాల్లో పాల్గొన్నారు. ఆ రోజుల్లో మద్రాస్‌లో తమిళ నాటకాలకు విపరీతమైన డిమాండ్‌ ఉండేది. ఎం.ఆర్.రాధ, మనోహర్‌ వంటి వారు సినిమాలకు ధీటుగా స్టేజిమీద భారీ సెట్టింగులూ, డాన్సులు, స్పెషల్‌ ఎఫెక్ట్‌లతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునేవారు.

రాధ నాటకం రక్తకన్నీర్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉండేది. సమాజంలోని అనేక రుగ్మతల మీద సెటైర్లు విసిరేది. చో రామస్వామి రాసిన ఆ నాటకాన్ని తెలుగులో తీసుకురావానుకున్నారు నాగభూషణం. తెలుగునాట నాటక ఉద్యమాన్ని బలోపేతం చేయాలనుకున్నారు. పాలగుమ్మి పద్మరాజు చేత ఆ నాటకాన్ని తెలుగులో రాయించారు. కొన్ని మార్పులు చేర్పులు చేశారు. రవి ఆర్ట్‌ థియేటర్స్‌ను స్థాపించి 1956లో మొదటిసారి రక్తకన్నీరు నాటకాన్ని ప్రదర్శించారు. రాధ స్కూలునే ఫాలో అయ్యారు. సురభీని మరపించే స్థాయిలో స్టేజి క్రాఫ్ట్‌ను తయారు చేశారు. తమిళంలో రాధ చేసినట్టుగానే తెలుగులో నాగభూషణం చేశారు. అనుకరించారంటే బాగుంటుంది. నాభిలోంచి శ్వాస తీసుకుంటూ వెక్కిళ్లు పెడుతున్నట్టుగా మాట్లాడటం, మాటిమాటికి రామా అంటూ శోకాలు పెట్టడం రాధ అనుకరణలే!

1956 మే నెలలో తన సొంత ఊరు నెల్లూరులో రక్తకన్నీరు నాటకాన్ని మొదటిసారిగా ప్రదర్శించారు నాగభూషణం. ఆ తర్వాత మొత్తం 5,432 ప్రదర్శనలకు నోచుకుంది. నెలకు పాతిక ప్రదర్శనలు ఉండేవి. ఒకే నెలలో 32 ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నారు. 1960లో విజయవాడ జింఖానా క్లబ్‌లో ఒకే రాత్రి రెండు ప్రదర్శనలు ఇస్తే ఆ రోజుల్లోనే పాతికవేల రూపాయలు కలెక్ట్‌ చేసింది. టికెట్‌ రేటు రెండు రూపాయలు, అర్ధరూపాయి ఉండేదంతే. అంటే ఆ నాటకానికి ఎంత మంది వచ్చి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు వాణిశ్రీ, శారద ఈ నాటకంలో వేసే సినిమావాళ్ల దృష్టిలో పడ్డారు. రేవతి, మీనాకుమారి, సుజాత, ఆదోని లక్ష్మి కూడా రక్తకన్నీరు నాటకం ద్వారానే సినిమాల్లోకి వచ్చారు. నాగభూషణం వేసే సెటైర్లు నాటకానికి ఎనలేని క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఏ ఊరు వెళితే అక్కడి స్థానిక రాజకీయాల మీద వ్యంగ్య బాణాలు విసిరేవారు. నాటకానికి జనం విరగబడి వచ్చేవారు. ఇలా నాటకంతో నాగభూషణానికి లభించిన ఆదరణ సినిమా ఫీల్డ్‌ను ఆకర్షించింది.

1951లో ప్రజా నాట్యమండలికి చెందిన తాతినేని ప్రకాశరావు పీపుల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ పతాకంపై తీసిన పల్లెటూరు సినిమాలో నాగభూషణానికి వేషం ఇచ్చారు. తర్వాత పెంకిపెళ్లాం, అమరసందేశం సినిమాల్లో వేశారు. సినిమాలు చేస్తూ నాటకాలు వేసేవారు నాగభూషణం. 1957లో వచ్చిన ఏది నిజం సినిమాలో హీరో పాత్ర పోషించారు. సినిమా బాగానే ఆడింది. రాష్ట్రపతి ప్రశంస కూడా పొందింది. అయినా నాగభూషణానికి హీరో వేషాలు రాలేదు. మాయాబజార్‌ వంటి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేశారు. 1960లో వచ్చిన శభాష్‌ రాజా సినిమాతో నాగభూషణం దశ తిరిగింది. ఆ మరుసటి ఏడాది మంచిమనుసులులో మంచి పాత్ర దొరికింది. ఆ తర్వాత వచ్చిన మూగమనసులు సినిమాతో నాగభూషణం ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.

ఎన్టీఆర్‌కు నాగభూషణం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన తీసిన ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తల్లా పెళ్లామా, కోడలు దిద్దిన కాపురం .. ఇలా ప్రతీ సినిమాలోనూ మంచి వేషాలు ఇచ్చారు. బ్రహ్మచారి సినిమాలో సూర్యకాంతానికి జోడిగా వేశారు. ముసలి వేషంలోనూ తన సంభాషణతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. బాపు తీసిన బాలరాజుకథలో వేసిన పనిగండం మల్లయ్య పాత్ర బాగా పాపులర్‌. నేనంటే నేనే సినిమాలో తల్లి వేషం కూడా వేశారాయన. ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన కథానాయకుడు సినిమా నాగభూషణానికి స్టార్‌ హోదా తెచ్చిపెట్టింది. నాగభూషణం డైలాగులకు జనం చప్పట్లు కొట్టారు. అదే సంవత్సరం వచ్చిన బుద్ధిమంతుడు కూడా నాగభూషణానికి మంచి పేరు తెచ్చింది. మళ్లీ హీరో వేషం వేయాలన్న తలంపుతో సొంతంగా నాటకాల రాయుడు అనే సినిమా తీశారు. సినిమా పోయింది. డబ్బులూ పోయాయి. ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఆయనతో ఒకే కుటుంబం సినిమా తీశారు. అది సూపర్‌హిట్టయ్యింది. పోయిన డబ్బులు మళ్లీ వచ్చాయి.

ఆ తర్వాత చో రామస్వామి తమిళనాటకం మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ను తెలుగులో సినిమాగా తీశారు. దాసరి నారాయణరావు సంభాషణలు అందించారు. ఇది కూడా విజయవంతమయ్యింది. 1971లో వాసిరెడ్డి సీతాదేవి రాసిన సమత అనే నవల ఆధారంగా ప్రజా నాయకుడు సినిమా తీశారు. అయితే సెన్సార్‌ వివాదంలో పడి ఆ సినిమా బాగా కత్తిరింపులకు గురయ్యింది. ఆ కారణంగా సినిమా సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత కూడా భాగస్థులు వంటి ఒకటి రెండు సినిమాలు తీశారు. 1974లో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాతో రావుగోపాలరావు సరికొత్త విలన్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. నెమ్మదిగా నాగభూషణం ఫేడ్‌అవుటవ్వసాగారు. 1977లో వచ్చిన అడవిరాముడు నాగభూషణం నటించిన చివరి విజయవంతమైన సినిమాగా చెప్పుకోవచ్చు. 1994లో వచ్చిన నంబర్‌వన్‌ సినిమా నాగభూషణం చివరి సినిమా. ఆ మరుసటి ఏడాది మే నెలలో అనారోగ్యం కారణంగా నాగభూషణం కన్నుమూశారు. నాగభూషణానిది ఓ ప్రత్యేక స్థానం. ఆ స్థానాన్ని భర్తి చేయగల నటుడు లేడు. రాబోడు కూడా!

Read Also….  Viral Photo: ఆమె కళ్లలోనే ఏదో నిషా ఉంది.. ఈ అమ్మ కూచి ఎవరో గుర్తుపట్టారా..?