Sigma Review: ‘సిగ్మా’ సినిమా రివ్యూ.. సీఎం విజయ్ కొడుకు దర్శకుడిగా సక్సెస్ అయ్యారా..?

విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా కావడంతో సిగ్మాపై ముందు నుంచి ఆసక్తి అందరిలోనూ ఉంది. పాతికేళ్ల కుర్రాడు ఏం తీసుంటాడు, ఎలాంటి సినిమాతో వచ్చుంటాడనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. పైగా సందీప్ కిషన్‌ హీరోగా రావడంతో తెలుగులోనూ అంచనాలు ఏర్పాడ్డాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ సంజయ్ రీచ్ అయ్యాడా లేదా అనేది చూద్దాం..

Sigma Review: సిగ్మా సినిమా రివ్యూ.. సీఎం విజయ్ కొడుకు దర్శకుడిగా సక్సెస్ అయ్యారా..?
Sigma Movie Review

Edited By:

Updated on: Oct 02, 2026 | 6:15 PM

మూవీ రివ్యూ: సిగ్మా

నటీనటులు: సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్ తదితరులు

సంగీతం: థమన్

సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్

ఎడిటింగ్: కె.ఎల్. ప్రవీణ్

దర్శకత్వం: జేసన్ సంజయ్

నిర్మాతలు : A. సుభాస్కరన్, G.K.M. తమిళ కుమరన్

 

కథ:

చనిపోయిన తన తల్లి కోరిక మేరకు గురు (సందీప్ కిషన్) తమ పాత ఇంట్లోనే ఉంటూ ఆమె మొదలుపెట్టిన ఒక ఉచిత గ్రంథాలయాన్ని నడుపుతుంటాడు. కానీ తండ్రి చేసిన అప్పుల వల్ల అతనికి కష్టాలు మొదలవుతాయి. ఆ ఇంటిని లాక్కోవడానికి వడ్డీ వ్యాపారులు గురు మీద బాగా ఒత్తిడి తెస్తుంటారు. ఆ అప్పులు తీర్చడానికి అతను రకరకాల దారులు వెతుకుతూ, చరిత్ర నేపథ్యంతో ఒక పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేస్తాడు. అందుకోసం ఆర్జే సామ్ (ఫరియా అబ్ధుల్లా) వాయిస్ బాగుంటుందని ఆమెను కలుస్తాడు. మరోవైపు డ్రగ్స్, క్యాసినో దందాలు చేసే కొట్లపాటి వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్) అనే గ్యాంగ్‌స్టర్ భారీగా బ్లాక్ మనీ కూడబెడతాడు. తన కష్టాలు తీర్చుకోవడానికి గురు ఆ క్యాసినోకు వెళ్లి మోసపోతాడు. ఆ తర్వాత అనుకోకుండా ఒక పెద్ద దొంగతనం ప్లాన్‌లో ఇరుక్కుంటాడు. అసలు ఆ భారీ కుట్ర ఏంటి, కోట్లాది రూపాయలున్న లాకర్‌కు సంబంధించిన తాళం చెవి కోసం జరిగే పోరాటంలో గురు ఎలా బయటపడ్డాడు, తన అప్పులు తీర్చుకున్నాడా లేదా అనేది మిగిలిన స్టోరీ.

కథనం:

తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఒక సామాన్యుడు భారీ దొంగతనం వ్యవహారంలో ఇరుక్కోవడం అనే పాయింట్ బాగానే ఉంది. హాలీవుడ్ తరహాలో క్యారెక్టర్లను కామిక్ బుక్ స్టైల్‌‌లో ఇంట్రడ్యూస్ చేసిన విధానం దర్శకుడి టేకింగ్‌ను చూపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్‌లో హీరో అప్పుల బాధలు, లైబ్రరీ కష్టాలు చూపిస్తూ కథను కాస్త నెమ్మదిగా నడిపించారు. ఇంటర్వెల్ ఫైట్, సెకండాఫ్ వేగం పెరిగినప్పటికీ యాక్షన్ సీన్స్ అనుకున్న స్థాయిలో పేలలేదు. ముఖ్యంగా ఇలాంటి హీస్ట్ థ్రిల్లర్స్‌కు లాజిక్స్ చాలా అవసరం. 2026లో బయోమెట్రిక్, హైటెక్ సెక్యూరిటీ వదిలేసి కోట్లాది రూపాయల నిధిని కాపాడటానికి ఒక మామూలు తాళం చెవి వాడటం ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు. బత్తా లాంటి సినిమాల్లో చిన్న లాక్స్‌తోనే ఎంతగా సస్పెన్స్ క్రియేట్ చేయొచ్చో చూపించారు. ఇక్కడ మాత్రం లాజిక్ మిస్సయింది. అలాగే ఫైట్లలో తుపాకులు ఉన్నా కూడా కత్తులతో దాడులు చేసుకోవడం లాంటివి నమ్మశక్యంగా అనిపించవు. హాలీవుడ్ స్టైల్లో ఒక ఫిమేల్ క్యారెక్టర్‌ను మోసం, నమ్మకద్రోహం చేసేలా డిజైన్ చేసినా దాన్ని కూడా తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. దర్శకుడు ఆలోచనలు బాగున్నా, రాసుకున్న స్క్రీన్ ప్లేలో నిలకడ లోపించడం సినిమాకు ప్రధాన మైనస్. లాజిక్స్ పక్కనపెడితే ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. ఏదో విజయ్ వీరాభిమానులకు సంజయ్ ఎలా డైరెక్ట్ చేసాడో తెలుసుకుందాం అనుకుంటే ఓసారి ట్రయల్ వేయొచ్చు.

నటీనటులు:

గురు పాత్రలో సందీప్ కిషన్ బాగున్నాడు.. తన యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఆర్జే సామ్‌గా నటించిన ఫరియా అబ్దుల్లా కు కోలీవుడ్‌లో ఇది మంచి ఎంట్రీ అని చెప్పొచ్చు. తన లుక్స్, నటనతో ఆకట్టుకుంది. రాజు సుందరం తెరపై కనిపించిన కాసేపు మంచి నవ్వులు పూయించాడు, ఆయనకు ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఇస్తే బాగుండేది అనిపిస్తుంది. ఇక విలన్‌గా సంపత్ రాజ్ ఎప్పటిలాగే చాలా సహజంగా నటించి మెప్పించాడు. కాకపోతే ఆయన క్యారెక్టర్‌కు సరైన ముగింపు ఇవ్వలేదు. మిగిలిన పాత్రలన్నీ ఓకే..

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ ఒక పెద్ద అసెట్ అని చెప్పాలి. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చాలా సీన్స్‌ను నిలబెట్టాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో మ్యూజిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. జేసన్ సంజయ్ టేకింగ్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ విజువల్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో చాలా స్టైలిష్‌గా అనిపిస్తాయి. ఫ్రేమ్స్ డిజైనింగ్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో కె.ఎల్. ప్రవీణ్ ఇంకాస్త కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా చాలా రిచ్‌గా ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా సిగ్మా.. యాక్షన్ డ్రామా.. కానీ చాలా కండీషన్స్ అప్లై..!

 

Loading...
Unable to load recommendations.
Follow Us