ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై ట్రోలింగ్ ఏ రేంజ్లో జరుగుతుందో చెప్పక్కర్లేదు. సినిమాల గురించి కాకుండా వ్యక్తిగత విషయాలపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. డ్రెస్సింగ్ దగ్గర్నుంచి యాక్టింగ్ వరకు ఇలా ప్రతి పనిలో ట్రోల్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు నెగిటివ్ విమర్శలు హద్దుదాటుతుంటాయి. అయితే చాలా మంది తారలు తమపై వచ్చే ట్రోలింగ్‌కు అంతగా పట్టించుకోరు. మరికొందరు మాత్రం నెగిటివ్ ట్రోలింగ్ పై తమదైన శైలీలో రియాక్ట్ అవుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రైమా సేన్ కు కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటోంది. ఇంట్లోని ల్యాండ్ లైన్ కు కాల్ చేసి బెదిరిస్తున్నారని.. ఆ వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రైమా సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మా కాళి’. 1946 ఆగస్ట్ 16న కలకత్తాలో జరిగిన దారుణమైన హత్యకాండ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇటీవలే ఈ మూవీకి సంబందించిన పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఇక అప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని వాపోయింది రైమా సేన్.
ప్రస్తుతం రైమా కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైమా సేన్ మాట్లాడుతూ.. “నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సినిమా కోసం ఇలాంటి బెదిరింపులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. హిందీ, బంగ్లా భాషలలో నన్ను బెదిరిస్తున్నారు. ముందు సినిమా చూసి అప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పండి. కానీ ఇప్పుడే ఎందుకు విమర్శిస్తున్నారు. మా కాళి సినిమా ఎందుకు ఒప్పుకున్నావని ప్రశ్నిస్తున్నారు. లెజండరీ నటి సుచిత్రా సేన్ మనవరాలు అయ్యుండి ఇలాంటి సినిమాను చేయడానికి ఎలా అంగీకరించావ్ అంటున్నారు. నువ్వు ఎప్పటికైనా కోల్ కత్తాలో ఉండాల్సి వస్తుందని అంటున్నారు. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం కూడా లేదు. నేను ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాను. ఇలాంటి ట్రోలింగ్..ఫోన్లు చేసి బెదిరించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. నేను నా కుటుంబంతో కలిసి కోల్ కత్తాలో ఉంటాను.. కానీ ఈ బెదిరింపు కాల్స్, ట్రోలింగ్ నా తల్లిదండ్రుల మనసులను ఆందోళను కలిగిస్తాయి” అన్నారు.
సినిమా చూడకుండానే ఇలా బెదిరించడం చాలా అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేసింది రైమా సేన్. ఒక నటిగా ఎలాంటి పాత్రలోనైనా నటించాలు. పాత్ర నచ్చితే ఏ సినిమా చేయడానికైనా అంగీకరిస్తాము. కానీ ఇప్పుడు మా కాళి విషయాన్ని అనవసరంగా వివాదంగా మారుస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. గతంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన వ్యాక్సిన్ వార్ సినిమాపై అనేక విమర్శలు చేశారని.. కానీ మూవీ విడుదలయ్యాక సైలెంట్ అయ్యారని.. కానీ ఇలా ఫోన్స్ చేసి బెదిరించడం తన జీవితంలో మొదటిసారి అని అన్నారు. రైమా సేన్ తెలుగులో నితిన్ జోడిగా ధైర్యం సినిమాలో నటించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.