Gold Smuggling: గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు.. రూ.25కోట్లు విలువైన బంగారం స్వాధీనం

|

Sep 02, 2021 | 12:06 PM

స్మగ్లింగ్‌ కోరలు చాస్తోంది. వెలుగులు పంచే బంగారం చీకట్లు నింపుతోంది. కాసుల ఎర అమాయకులను కటకటాలపాల్జేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయాలే కేంద్రంగా సాగుతున్న దందా దడ పుట్టిస్తోంది.

Gold Smuggling: గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు.. రూ.25కోట్లు విలువైన బంగారం స్వాధీనం
Gold Smuggling Case
Follow us on

ED attaches Gold Smuggling Assets: స్మగ్లింగ్‌ కోరలు చాస్తోంది. వెలుగులు పంచే బంగారం చీకట్లు నింపుతోంది. కాసుల ఎర అమాయకులను కటకటాలపాల్జేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయాలే కేంద్రంగా సాగుతున్న దందా దడ పుట్టిస్తోంది. అమాయకులే వారి అస్త్రం.. నిరుద్యోగులే ఆ ముఠా టార్గెట్‌. వేలాది రూపాయల డబ్బు ఆశ చూపి ఊబిలోకి దించేస్తారు. వస్తే లక్షలు.. పోతే వేల రూపాయలు.. ఇలా సాగుతోంది గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం. డబ్బుకు లొంగి స్మగ్లింగ్‌లోకి దిగుతున్న నిరుద్యోగులు దేశం కాని దేశాల్లోని జైళ్లల్లో మగ్గిపోతున్నారు. బంగారం స్మగ్లింగ్‌.. రూ. 360 కోట్ల పసిడిని మొన్న సీజ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ).. తాజాగా మళ్లీ ఓ పాతిక కోట్లు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

బంగారంలో పెట్టుబడులు పెట్టినవారికి లాభాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. దానితోపాటు బంగారం స్మగ్లింగ్ కూడా పెరిగిపోయింది. గోల్డ్ దందాలో ఐడియాలు చూస్తూంటే ఇలాకూడా చేయవచ్చా అని అనిపించక మానదు. అయితే అక్రమార్కులు ఎంత రెచ్చిపోయి స్మగ్లింగ్ చేస్తున్నారో.. వారికి అంతే ధీటుగా కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఆభరణాల వ్యాపారి కుటుంబానికి చెందిన రూ.25 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ఈ కేసుకు సంబంధించి సంజయ్ అగర్వాల్, రాధిక అగర్వాల్, ప్రీతం కుమార్ అగర్వాల్‌కు చెందిన విల్లాలు, 54 కిలోల బంగారాన్ని కోల్‌కతా ఈడీ విభాగం తాత్కాలికంగా జప్తు చేసింది. కోల్‌కతా డీఆర్ఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరిపారు. ఇప్పటికే ప్రీతం కుమార్ అగర్వాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. విదేశాలకు ఎగుమతి పేరుతో ఎంఎంటీఏసీ, ఎస్‌టీసీ, డైమండ్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డ్యూటీ ఫ్రీ బంగారం కొనుగోలు చేసి.. అగర్వాల్ అక్రమంగా దేశీయంగా వ్యాపారం చేసినట్లు అభియోగాలున్నాయి.

బంగారం అక్రమ రవాణాను ఉగ్ర చర్యగా పరిగణించాలా లేదా అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు కూడా ఇటీవలే అంగీకరించింది. దీంతో చాలావరకు బంగారం వ్యాపారం చేసేవాళ్లు సర్దుకున్నారు. కానీ తామేం చేసినా దొరకమని అనుకున్నవారికి ఈడీ చుక్కలు చూపిస్తోంది. అయితే, హైదరాబాద్‌లో ఇంత భారీ స్థాయిలో ఈడీ సోదాలు చేయడం, కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేయడం, గోల్డ్‌ వ్యాపారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవరనీ నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో తెలియని అయోమయంలో ఉన్నారు వ్యాపారులు. ఇకపై కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించే వారితోనే లావాదేవీలు జరుపుకోవాలనే చర్చ వ్యాపార వర్గాల్లో జరుగుతోంది.

ఇదిలావుంటే, గత నెలలో తెలంగాణలోనూ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా బండారం బయటపడింది. జగిత్యాల జిల్లాకు సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఈ కోవలోకే వస్తాడు. అమాయకంగా కొంతమంది స్మగ్లర్స్‌ నమ్మి నిలువునా మోసపోయాడు. సర్ఫరాజ్‌కు మూడేళ్ల క్రితం కోరుట్లలో ఉండే జీశాన్, తౌఫిక్, తన్వీర్‌లతో పరిచయమైంది. దుబాయ్‌ నుంచి ఓ పార్శిల్‌ తీసుకురావాలి.. విమానం, వీసా ఖర్చులన్నీ తామే చూసుకుంటాం.. పార్శిల్‌ తీసుకొచ్చినందుకు 40 వేలు ఇస్తామని ఎరవేశారు. డబ్బుల ఆశతో సర్ఫరాజ్‌ 2018లో దుబాయ్‌ వెళ్లాడు. అక్కడే ఓ మనిషిని కలిశాడు. అతను ఇచ్చిన పార్శిల్‌ తీసుకుని నేపాల్‌ మీదుగా వస్తుండగా.. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. పార్శిల్‌లో అక్రమంగా తరలిస్తున్న అర కిలో బంగారం ఉండటంతో స్వాధీనం చేసుకుని సర్ఫరాజ్‌పై కేసు పెట్టా రు. ఆ పార్శిల్‌లో ఏముందో తెలియని సర్ఫరాజ్‌ మూడేళ్లుగా నేపాల్‌ జైల్లో మగ్గుతున్నాడు.

సర్ఫరాజ్‌ అరెస్టు కాగానే జీశాన్, తౌఫిక్, తన్వీర్‌లు పరారయ్యారు. అన్యాయంగా జైల్లో మగ్గుతున్న తన భర్తను ఎలాగైనా విడిపించాలని సర్ఫరాజ్‌ భార్య అఫ్రిన్‌ బేగం వేడుకుంటోంది. సర్ఫరాజ్‌ లాగే అనేక మంది స్మగ్లర్స్‌ మాట వింటూ నిలువునా మోసపోతున్నారు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేద యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి బంగారం స్మగ్లింగ్‌ ముఠాలు. నాందేడ్‌కు చెందిన కొందరు ముంబై, దుబాయ్‌ గోల్డ్‌ స్మగ్లింగ్‌ ముఠాలతో చేతులు కలిపి ఈ దందాకు తెరలేపుతున్నారు.

Read Also… Viral Video: భూమ్యాకర్షణ లేని చోట వ్యోమగాములు తల స్నానం ఎలా చేస్తారో తెలుసా.? వైరల్‌ వీడియోపై ఓ లుక్కేయండి.

Pawan Kalyan Rare Photos: ఇద్దరు అన్నల ముద్దుల తమ్ముడు.. నాటి చిన్నారి కళ్యాణ్ బాబు నుంచి నేటి వరకూ అరుదైన ఫోటోలు మీకోసం