అతని పేరు షరీఫ్.. ఊరు కాని ఊరు వచ్చాడు.. పొలంలో వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కాని నాలుగు రోజుల క్రితం పంట కాలువలో శవమై తేలాడు.. పట్టా చుట్టిన మృతదేహం కాలువలో కొట్టుకువచ్చింది.. అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.. అయితే.. కేసును చేధించే క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. కూలి మృతికి ముందు ఏం జరిగిందో అన్న దానిపై ఆరా తీయగా.. అసలు విషయం వెలుగుచూసింది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా గురజాల మండలం అంబాపురానికి చెందిన అంకిరెడ్డి, సైదమ్మ దంపతులు వ్యవసాయదారులుగా జీవనం సాగిస్తున్నారు. వీరు ప్రతి ఏటా పది ఎకరాల వరకూ సాగు చేస్తుంటారు. మిరప, ప్రత్తి సాగు చేసే వీరికి కూలీల కొరత విపరీతంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా వ్యవసాయ కూలీలను ఇతర ప్రాంతాల నుండి అంబాపురానికి తీసుకొచ్చి పనులు చేయిస్తుంటారు.
ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుట్లూర్ కు చెందిన కొంతమంది కూలీలు ప్రతి ఏటా అక్కడ నుంచి అంబాపురానికి వచ్చి ఇక్కడ కూలీలుగా ఉండి సీజన్ కాగానే వెళ్ళిపోతుంటారు. ఇలా వచ్చిన వారిలో యువకుడైన షరీఫ్ అంకిరెడ్డి వద్దే వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. గత పదేళ్ళ నుండి ఒక కూలీల ముఠా అంబాపురం రావడం ఇక్కడ సీజన్ ముగియగానే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది..
అయితే షరీఫ్ మాత్రం.. అంకిరెడ్డి వద్దే ఉంటూ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తుండేవాడు. ఈ క్రమంలో ప్రతి ఏటా అంకిరెడ్డి కొంత డబ్బులు ఇవ్వకుండా వచ్చే సీజన్ చెల్లిస్తానని చెబుతూ ఉండేవాడు. ఆ మొత్తం లక్ష రూపాయలకు చేరింది. ఈ క్రమంలోనే షరీఫ్ ఈ సీజన్ లో మొత్తం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశాడు..
ప్రతి రోజు డబ్బులు అడుగుతుండటంతో రైతు దంపతులకు చికాకు పుట్టించింది. లక్ష రూపాయలు ఇవ్వాల్సి రావడం భారంగా భావించిన దంపతులు షరీఫ్ అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. దీనికోసం ప్లాన్ వేశారు..
నవంబర్ 11న డబ్బులిస్తామని చెప్పి అంకిరెడ్డి, సైదమ్మ దంపతులు.. షరీఫ్ ను ఇంటికి పిలిచారు. ఇంటికి వచ్చిన షరీఫ్ పై ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం దాడి చేశారు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని గోతం పట్టాల్లో చుట్టి గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్ళి పంట కాలువలో పడేశారు.
ఆ తర్వాత ఏం తెలియనట్టే.. ఎప్పటిలాగే జీవనం సాగిస్తున్నారు. అయితే.. పంట కాలువలో షరీఫ్ శవమై కనిపించడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షరీఫ్ ఫోన్ కాల్ డేటా ప్రకారం లాస్ట్ కాల్ అంకిరెడ్డిదే ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో అంకిరెడ్డి, సైదమ్మను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కూలీ డబ్బులు చెల్లించమని ఒత్తిడి చేయడంతోనే అతని అడ్డు తొలగించుకున్నారని గురజాల డిఎస్పీ జగదీష్ తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..