శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తాట తీస్తాం..హైదరాబాద్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సీపీ అంజనీకుమార్‌

గ్రేటర్‌ ఎన్నికల వేడి పీక్స్‌కు చేరుకుంది. నేతల మధ్య మాటల మంటలు ఆందోళనకర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నారన్న వార్తలు భయపెడుతున్నాయి.

  • Sanjay Kasula
  • Publish Date - 11:11 am, Thu, 26 November 20

CP Anjanikumar Warned : గ్రేటర్‌ ఎన్నికల వేడి పీక్స్‌కు చేరుకుంది. నేతల మధ్య మాటల మంటలు ఆందోళనకర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నారన్న వార్తలు భయపెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందన్న టెన్షన్‌ అందరిలోనూ కన్పిస్తోంది. అల్లర్లు సృష్టించేందుకు సోషల్‌ మీడియాను ఆయుధంగా ఎంచుకుంటున్నారు. మార్ఫింగ్‌ ఫోటోలు, తప్పుడు వార్తలతో… హైదరాబాద్‌లో హింస సృష్టించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

కొన్ని అరాచకశక్తులు నగరంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్రలు పన్నుతున్నాయని, వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచకశక్తుల కుట్రలపై కచ్చితమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. శాంతిభద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానమని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.


ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని ప్రకటించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యథావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయొద్దని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం పోలీసులకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారు.

మరోవైపు హైదరాబాద్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ అంజనీకుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముసుగులో కొంతమంది మత ఘర్షణలకు పాల్పడే ప్రమాదముందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు రూమర్స్‌ను నమ్మవద్దని సూచించారు. మత ఘర్షణలను సృష్టించాలని చూస్తే పీడియాక్ట్‌ పెడతామని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు..ఘర్షణలు జరిగేట్లు పెడుతున్న పోస్ట్‌లపై నిఘా పెట్టామని తెలిపారు. ఎలాంటి ఘటనలు జరిగినా భారీ మూల్యం తప్పదు సీపీ అంజనీకుమార్‌ వార్నింగ్‌ ఇచ్చారు.