కోవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తి, నివారణా చర్యలు, వ్యాక్సినేషన్‌పై సీఎంకు అధికారులు వివరాలు తెలియజేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. రెండో వేవ్‌తో పోల్చిచూస్తే… ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా పెంచి సిద్ధం చేశామన్నారు. అన్నిజిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దాదాపు 27వేల యాక్టివ్ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో ఆక్సిజన్ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమే అన్నారు.
అధికారుల నంచి అన్ని వివరాలు తెలసుకున్న సీఎం.. ఈ మేరకు వైద్య పరంగా అవసరాలను గుర్తించాలని సూచించారు. అవసరమైన ఆక్సిజన్‌ను, మందులను వెంటనే సిద్ధం చేయాలన్నారు. గతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలంటే కనీసం 14 రోజులు ఉండేదని, ఇప్పుడు వారం రోజులకు ముందే డిశ్చార్జి అవుతున్నారని అధికారులు సీఎంకు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్‌కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
104 కాల్‌సెంటర్‌పైనా సీఎం సమీక్ష
కాల్‌సెంటర్ పటిష్టంగా పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. టెలిమెడిసిన్ కోసం కాల్‌చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రికాషన్ డోస్ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలంటూ కేంద్రానికి లేఖరాయాలని సీఎం ఈ సందర్భంగా నిర్ణయించారు. దీనివల్ల ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్న వారికి ఉపయోగమని సమావేశంలో జగన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్‌నుంచి రక్షించే అవకాశం ఉంటుందన్నారు.
వ్యాక్సినేషన్
రెండో డోస్ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం అధికారుల ఆదేశించారు. 15 నుంచి 18 ఏళ్లవారికి నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశారు. మరో 5 జిల్లాల్లో ఈ వయసులవారికి 90 శాతానికిపైగా వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. మరో నాలుగు జిల్లాల్లో 80శాతానికిపైగా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ ఉద్ధృతంగా వ్యాక్సినేషన్ చేయాలని సీఎం ఆదేశించారు.
కోవిడ్ పరీక్షల్లో కేంద్రం కొత్త మార్గదర్శకాలపైనా సమావేశంలో సీఎం చర్చించారు. కోవిడ్ లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొందని అధికారులు సీఎంకు నివేదించారు. కోవిడ్ పాజిటివ్ తేలినవారి కాంటాక్ట్స్‌లో కేవలం హైరిస్క్ ఉన్నవారికి పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసిందని తెలిపారు.
కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రగతిపైనా సీఎం సమీక్ష..
ఆరోగ్య శ్రీపై పూర్తి వివరాలు తెలిపేలా విలేజ్, వార్డ్ క్లినిక్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద హోర్డింగ్ పెట్టాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ రిఫరల్ పాయింట్‌గా క్లినిక్స్ వ్యవహరించాలని, వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలతో సమాచారం లభించాలని సీఎం సూచించారు. ఆరోగ్యశ్రీ కింద పేషెంట్ రిఫరల్ వ్యవస్థపై రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను సీఎం సమగ్రంగా రివ్యూ చేశారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలకు, గ్రామ–వార్డు సచివాలయాల్లో ఆరోగ్య మిత్రలకు, పీహెచ్‌సీ ఆరోగ్య మిత్రలకు, 104 మెడికల్ ఆఫీసర్‌కు, 108 మెడికల్ ఆఫీసర్‌కు రూపొందించిన ఎస్‌ఓపీలను సీఎం పరిశీలించారు. విలేజ్ క్లినిక్‌లలో శాశ్వతంగా హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అత్యవసర వైద్య సేవలు కావాల్సిన వచ్చినప్పుడు ఎవరిని, ఎలా సంప్రదించాలనేది స్పష్టంగా తెలియాలన్నారు. విలేజ్ క్లినిక్‌తో పాటు సచివాలయం, రైతు భరోసా కేంద్రాలలో కూడా హోర్డింగ్ ఏర్పాటుచేయాలన్న సీఎం సూచించారు.
విలేజ్‌క్లినిక్‌కు వెళ్లినా, పీహెచ్‌సీ, నెట్‌వర్క్ ఆస్పత్రి … ఇలా పేషెంట్ ఎక్కడకు వెళ్లినా.. వారి ఆరోగ్య పరిస్థితిని వెంటనే తెలుసుకుని, వైద్యం కోసం ఎక్కడకు పంపాలన్న విధానం చాలా పటిష్టంగా ఉండాలని సీఎం ఆదేశించారు. 104, 108, పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ఉండే డాక్టర్లు కూడా ఈ ప్రక్రియలో భాగమయ్యేలా చూడాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ సేవల సమన్వయం కోసం యాప్ పనిచేయాలని సీఎం సూచించారు. 108 కు కాల్ చేసినా, ఆరోగ్య మిత్ర రిఫర్ చేసినా ఈ యాప్ దగ్గరలో ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రికి రిఫర్ చేస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంపై కూడా దృష్టి పెట్టాలన్న సీఎం ఆదేశించారు. దీని ద్వారా వ్యవస్ధ మరింత బలపడుతుందన్నారు. రిఫరల్ వ్యవస్ధలో ఏఐ వాడగలిగితే మరింత పారదర్శకంగా ఉంటుందని చెప్పారు.
నెట్ వర్క్ ఆస్పత్రిలో చికిత్సతో పాటు ఆరోగ్య ఆసరా అందించిన అనంతరం ఇంటికి వెళ్లిన పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్‌ఎం ఆరా తీరాయలని సీఎం ఆదేశించారు. దీంతో పాటు మరలా ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామన్న విషయాన్ని తెలిపాలన్నారు. ఇది పేషెంట్‌కు గొప్ప ధైర్యాన్నిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.
Also Read: Andhra Pradesh: ఏపీలో పాఠశాలలకు సెలవుల కొనసాగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారీటీ