బాయ్‌ ఫ్రెండ్‌తో పారిపోవాలనుకున్న బాలిక.. కట్‌చేస్తే ఇంటర్‌లో 945 మార్కులతో స్టేట్ టాప్‌ ర్యాంక్‌!

తల్లిదండ్రులకు దూరమై బాలికల సంరక్షణ కేంద్రంలో ఉంటూ చదువుకున్న తెలంగాణకు చెందిన 17 ఏళ్ల యువతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 945 మార్కులు సాధించి సత్తా చాటింది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా చదువును నిర్లక్ష్యం చేయకుండా తన లక్ష్యంపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో బీకాం చదివి ప్రొఫెసర్‌గా ఎదగాలని, సొంతంగా సంపాదించడం ప్రారంభించిన తర్వాతే ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆమె పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకం..

బాయ్‌ ఫ్రెండ్‌తో పారిపోవాలనుకున్న బాలిక.. కట్‌చేస్తే ఇంటర్‌లో 945 మార్కులతో స్టేట్ టాప్‌ ర్యాంక్‌!
Telangana Girl Becomes Board Exam Topper

Updated on: Oct 26, 2026 | 5:28 PM

జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చని ఓ బాలిక నిరూపించింది. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమై, బాలికల సంరక్షణ కేంద్రంలో ఉంటూ చదువును కొనసాగించిన ఆమె.. తాజాగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో 945 మార్కులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా చదువుపై దృష్టి సారించి ఈ ఘనత సాధించింది. మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. తెలంగాణకు చెందిన ఈ బాలికకు 14-15 ఏళ్ల వయసున్నప్పుడు ఓ బాలుడితో పరిచయం ఏర్పడింది. వారి ప్రేమ వ్యవహారం గురించి తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఈ సంబంధానికి అంగీకరించలేదు. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే, ఆమె మైనర్ కావడంతో పోలీసులు గుర్తించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. కానీ, తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో కుటుంబానికి దూరమైన ఆ బాలిక బాలికల సంరక్షణ కేంద్రంలో ఉండాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆమె తన చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కష్టాలను అధిగమిస్తూ విద్యపై దృష్టి పెట్టింది.

ఇంటర్‌లో 945 మార్కులు.. చదువులో అద్భుత ప్రతిభ

కల్లం ఆంజిరెడ్డి వొకేషనల్ జూనియర్ కాలేజీలో చదువుకున్న ఈ బాలిక.. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాల్లో 945 మార్కులు సాధించింది. ఈ మార్కులతో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచినట్లు మనీ కంట్రోల్ కథనం వెల్లడించింది. కుటుంబానికి దూరంగా ఉంటూ, ఎన్నో వ్యక్తిగత ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ చదువులో ఈ స్థాయి ఫలితాన్ని సాధించడం విశేషం. ఆమె సాధించిన విజయం విద్యపై ఉన్న ఆసక్తిని, లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలను తెలియజేస్తోంది. ఇటీవల ఆ బాలిక తన తల్లిదండ్రులతో మళ్లీ మాట్లాడటం ప్రారంభించింది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసి, తిరిగి ఇంటికి రావాలని కోరినట్లు ఆమె తెలిపింది.

ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ‘ఒకటి లేదా రెండు నెలల క్రితమే నేను నా తల్లిదండ్రులతో మళ్లీ మాట్లాడటం ప్రారంభించాను. నేను సాధించిన మార్కుల గురించి తెలుసుకున్న తర్వాత వారు చాలా సంతోషించారు. ఇంటికి తిరిగి రావాలని కూడా చెప్పారు. అయితే, నేను ఇంటికి తిరిగి వెళ్తానా లేదా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని పేర్కొంది. భవిష్యత్తులో కామర్స్ చదవాలని ఈ బాలిక నిర్ణయించుకుంది. బీకాం పూర్తి చేసి, అకౌంటెన్సీకి సంబంధించిన పనులు చేస్తూ, ఆ తర్వాత ప్రొఫెసర్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా ఆర్థికంగా స్వతంత్రంగా మారిన తర్వాతే ఇంటికి తిరిగి వెళ్లాలని భావిస్తోంది. ‘నేను బీకాం చదవాలని నిర్ణయించుకున్నాను. చదువుకుంటూనే అకౌంటెన్సీకి సంబంధించిన పనులు చేయగలను. భవిష్యత్తులో ప్రొఫెసర్‌గా మారాలని అనుకుంటున్నాను. నేను సంపాదించడం ప్రారంభించిన తర్వాతే ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె తెలిపింది.

ఇవి కూడా చదవండి

జీవితంలో ఎదురయ్యే సమస్యలు మన లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డంకులుగా మారకూడదని ఈ బాలిక ప్రయాణం గుర్తుచేస్తోంది. కుటుంబానికి దూరంగా ఉంటూ, సంరక్షణ కేంద్రంలో జీవనం సాగించినప్పటికీ చదువును కొనసాగించి మంచి మార్కులు సాధించడం ఆమె పట్టుదలకు నిదర్శనం. భవిష్యత్తులో ఆమె అనుకున్న లక్ష్యాలను చేరుకుని, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని ఆశిద్దాం.

Loading...
Unable to load recommendations.
Follow Us