
హైదరాబాద్, అక్టోబర్ 19: రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం 2025 ఏప్రిల్ 4న జారీ చేసింది. అయితే ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవల పలువురు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి నియామకాలను వేగవంతం చేయాలని కోరారు. దీంతో ప్రభుత్వం సంబంధిత అధికారులతో సమీక్షించి, నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టింది. గతంలో జారీ చేసిన జీవో 21కు సవరణలు చేస్తూ జీవో 31 విడుదల చేయగా, తాజాగా ఖాళీల వివరాలతో ఆర్థికశాఖ జీవో 141 జారీ చేసింది. నియామకాల తదుపరి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సంబంధిత విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. ఆర్థికశాఖ అనుమతి లభించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు తదుపరి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా పోస్టులు, సామాజిక వర్గాల వారీగా రోస్టర్ పాయింట్లను ఖరారు చేయాలి. అనంతరం సంబంధిత సంక్షేమ శాఖల అనుమతులు పొందాలి. విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల ఆమోదం తర్వాత నియామక నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
ఈ ప్రక్రియకు సుమారు నెల రోజుల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్ 2 నాటికి నియామక పత్రాలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, నోటిఫికేషన్ల విడుదల తేదీలు, దరఖాస్తుల గడువు, పరీక్షల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మొత్తం 448 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు గతంలో విద్యాశాఖ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అయితే తాజా ఆమోదం ప్రకారం 429 పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సుమారు 860 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించకుండా, మిగిలిన ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను ఈ విడతలో భర్తీ చేయడం లేదు. నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం 16 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపినప్పటికీ, వాటిని ప్రస్తుత ఆమోదంలో పరిగణనలోకి తీసుకోలేదు. కాకతీయ విశ్వవిద్యాలయంలో 68 ఖాళీలు ఉండగా, 49 పోస్టుల భర్తీకే అనుమతి లభించింది.
ఈ కారణాలతో మొత్తం పోస్టుల సంఖ్య 448 నుంచి 429కు తగ్గింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 252 పోస్టులు ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 48 విభాగాలతో పాటు సిద్దిపేట, జోగిపేట, నర్సాపూర్ పీజీ కళాశాలల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో 21 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. జువాలజీ విభాగంలో అత్యధికంగా ఆరు పోస్టులు ఉండగా, ఇంగ్లిష్, కామర్స్, ఆర్థికశాస్త్రం విభాగాల్లో ఐదేసి పోస్టులను భర్తీ చేయనున్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో 11 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరో 38 పోస్టులు హుస్నాబాద్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్నాయి.