JEE Advancedలో మార్పులు.. మూడో ప్రయత్నంకు అవకాశం ఉంటుందా?

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో కోచింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం, ప్రత్యేక పరిస్థితుల్లో అదనపు ప్రయత్నానికి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించడం, ప్రత్యామ్నాయ ప్రవేశ మార్గాలను ప్రోత్సహించడం వంటి అంశాలు రాబోయే రోజుల్లో ఐఐటీల ప్రవేశ విధానంలో చర్చనీయాంశాలుగా మారనున్నాయి. అయితే పరీక్షలో మార్పులు, మూడో ప్రయత్నానికి సంబంధించిన తుది నిర్ణయాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు..

JEE Advancedలో మార్పులు.. మూడో ప్రయత్నంకు అవకాశం ఉంటుందా?
JEE Advanced Exam to Be Revamped

Updated on: Oct 18, 2026 | 4:59 PM

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష విధానంలో రానున్న సంవత్సరాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరీక్ష విధానం తక్షణ భవిష్యత్తులో మారకపోయినా, వచ్చే కొన్నేళ్లలో సమగ్ర సంస్కరణలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఐఐటీ కాన్పూర్‌ డైరెక్టర్‌ మనీంద్ర అగర్వాల్‌ వెల్లడించారు. ఈ పరీక్ష కోచింగ్‌పై అధికంగా ఆధారపడుతోందని, ఆ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మార్పులు వెంటనే ఉండకపోవచ్చని, అయితే రాబోయే కొన్నేళ్లలో పరీక్ష విధానాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని తెలిపారు. పరీక్షలో కోచింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

మూడోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుందా?

ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను వరుసగా రెండేళ్లు మాత్రమే రాసేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంది. అయితే మూడోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించే అంశం కూడా పరిశీలనలో ఉందని మనీంద్ర అగర్వాల్‌ తెలిపారు. అందరికీ సాధారణంగా మూడో అవకాశం ఇవ్వడం కాకుండా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతించే విధానంపై చర్చిస్తున్నట్లు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన విధానం ఇంకా ఖరారు కాలేదని వెల్లడించారు. మరోవైపు, పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో మూడో అవకాశం కల్పించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ఈ మేరకు విద్యార్థులు ప్రారంభించిన ఆన్‌లైన్‌ పిటిషన్‌కు 12,000 మందికి పైగా సంతకాలు వచ్చినట్లు ఒక జేఈఈ అభ్యర్థి పేర్కొన్నారు. మూడో ప్రయత్నానికి అనుమతించాలని లేదా మూడేళ్ల వ్యవధిలో రెండుసార్లు పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలని వారు కోరుతున్నారు.

ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందిన విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు జేఈఈ పరీక్షపై ముందస్తు అవగాహన, నాణ్యమైన కోచింగ్‌ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. కొందరికి ఇంటర్‌ పూర్తయిన తర్వాతే జేఈఈ గురించి తెలుస్తోందని, మరికొందరు అనారోగ్యం లేదా ప్రమాదాల కారణంగా తమ ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని పేర్కొంటున్నారు. అయితే మూడో అవకాశం కల్పించడం వల్ల ప్రయోజనాలతో పాటు ప్రతికూలతలు కూడా ఉంటాయని అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. మరికొంతమంది విద్యార్థులకు మెరుగైన అవకాశం లభించినప్పటికీ, చాలామంది మరో ఏడాది సమయాన్ని వెచ్చించి, అదనపు కోచింగ్‌ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేసే పరిస్థితి రావచ్చని చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలు, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి వంటి అంశాలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ లేకుండానే కొన్ని కోర్సుల్లో ప్రవేశాలు

సంప్రదాయ ఐఐటీ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రధాన మార్గంగానే కొనసాగుతుందని అగర్వాల్‌ స్పష్టం చేశారు. అయితే కొన్ని ప్రత్యేక కోర్సుల్లో ప్రత్యామ్నాయ విధానాల ద్వారా విద్యార్థులను చేర్చుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇందులో భాగంగా ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ మద్రాస్‌ సహకారంతో ప్రారంభించిన బ్యాచిలర్‌ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ (B Cyber) కోర్సును ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ కోర్సులో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్కోరు తప్పనిసరి కాకుండా, జేఈఈ మెయిన్‌ స్కోరు, సైబర్‌ సెక్యూరిటీ రంగంలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసే విధానాన్ని అనుసరించారు. ఈ ప్రక్రియలో ఎంపికైన సుమారు 120 మంది అభ్యర్థులను క్యాంపస్‌లో నిర్వహించిన హ్యాకథాన్‌కు ఆహ్వానించారు. అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్‌లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు ప్రత్యేక మార్గాలు ఉన్నాయి.

ఐఐటీ కాన్పూర్‌ పరిశోధనా సదుపాయాలను అభివృద్ధి చేయడం, నాలుగు కొత్త విద్యార్థుల వసతి గృహాలను నిర్మించడం, మానసిక ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలతో నిధుల సమీకరణ చేపడుతోంది. 2029 మార్చి నాటికి ఒక బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దాదాపు సగం మొత్తానికి ఇప్పటికే హామీలు లభించాయని అగర్వాల్‌ తెలిపారు. ఈ నిధులను పరిశోధన, విద్యార్థుల వసతి, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే వారందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడమే ప్రతిపాదిత కేంద్రం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఐఐటీ కాన్పూర్‌లో పది మంది పూర్తికాల కౌన్సెలర్లు సహా ఇతర నిపుణులు విద్యార్థులకు సేవలు అందిస్తున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ వీడియోలు, కృత్రిమ మేధ (AI) సాధనాలపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో బోధనా పద్ధతులు కూడా మారాల్సిన అవసరం ఉందని అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. తరగతులకు హాజరును తప్పనిసరి చేయడం కంటే, విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులకు రావాలనుకునే వాతావరణాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని తెలిపారు.

విద్యార్థులు తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి, ఉపయోగకరమైన ఉత్పత్తులుగా రూపొందించేలా ప్రోత్సహిస్తే పరిశోధన, అభివృద్ధి (R&D) రంగాలపై ఆసక్తి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారని, పరిశోధనల్లోకి వచ్చే వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us