
కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే కేవలం ప్రాంతాలను మార్చడం మాత్రమే కాదు.. మన ఆలోచనా విధానాన్ని, జీవనశైలిని కూడా మార్చుకోవడమే. కొత్త నగరాల్లో ఒంటరిగా లేదా కొత్త వ్యక్తులతో కలిసి జీవించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అనుభవాన్నే ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ తేజు తన తాజా వీడియోలో పంచుకున్నారు. కొత్త నగరాలకు వెళ్లిన తర్వాతే తాను నిజంగా ‘అడల్ట్’గా మారడం నేర్చుకున్నానని ఆమె చెప్పారు. తన జీవితాన్ని మలుపు తిప్పిన మూడు నగరాలు బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్ అని తేజు తెలిపారు. ఒక్కో నగరం తనకు ఒక్కో ముఖ్యమైన జీవిత పాఠాన్ని నేర్పిందని ఆమె వివరించారు.
తేజు జీవితంలో కీలకమైన మొదటి నగరం బెంగళూరు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన ఆమె తెలుగు మీడియం పాఠశాలలో చదువుకున్నారు. పదేళ్ల వయసులో కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. అప్పటివరకు తన ప్రపంచం కేవలం తన గ్రామానికే పరిమితమై ఉండేదని తేజు గుర్తు చేసుకున్నారు. బెంగళూరుకు వెళ్లిన తర్వాత అనేక భాషలు, విభిన్న సంస్కృతులు, భిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తులను కలుసుకునే అవకాశం లభించిందన్నారు. తన ప్రపంచం ఒక చిన్న గ్రామంగా ఉన్న సమయంలో బెంగళూరు తనకు పెద్ద ప్రపంచాన్ని చూపించిందని తేజు పేర్కొన్నారు.
తేజు జీవితాన్ని ప్రభావితం చేసిన రెండో నగరం హైదరాబాద్. కాలేజీ రోజుల్లో హాస్టల్‌లో ఉండే అవకాశం రాకపోవడంతో, మరో నగరంలో స్వతంత్రంగా జీవించాలని ఆమె భావించారు. దీంతో వచ్చిన తొలి ఉద్యోగావకాశాన్ని స్వీకరించి హైదరాబాద్‌కు వెళ్లారు. హైదరాబాద్‌లోనే ఆమె తొలిసారిగా స్వతంత్ర జీవితాన్ని అనుభవించారు. మొదటిసారి జిమ్‌లో చేరడం, సొంతంగా కిరాణా సామాన్లు కొనడం, రోజువారీ పనులను తానే చూసుకోవడం వంటి విషయాలను ఇక్కడే నేర్చుకున్నట్లు చెప్పారు. అంతేకాదు.. తన బట్టలు తానే ఉతుక్కోవడం కూడా ఇక్కడే నేర్చుకున్నానని, అప్పుడే తాను నిజంగా పెద్దదాన్నయ్యాననే భావన కలిగిందని తేజు తెలిపారు.
తేజు జీవితంలో మూడో కీలకమైన నగరం దుబాయ్. 31 ఏళ్ల వయసులో భారతదేశంలో ఉన్న స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి భర్తతో కలిసి దుబాయ్‌కు వెళ్లారు. అక్కడ కొత్త ఉద్యోగం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేశారు. జాబ్ పోర్టల్స్‌లో కనిపించిన దాదాపు ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. తనకు ఎక్కడి నుంచీ స్పందన రాలేదని తేజు చెప్పారు. వరుసగా ‘ఘోస్టింగ్’ ఎదురైనప్పటికీ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. చివరకు కొన్ని సంవత్సరాల క్రితం పరిచయమైన ఓ వ్యక్తి ద్వారా ఆమెకు ఉద్యోగావకాశం లభించింది. ఈ అనుభవం తనకు నెట్‌వర్కింగ్ ఎంత ముఖ్యమో నేర్పిందని తేజు చెప్పారు. బెంగళూరు తనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే, హైదరాబాద్ స్వతంత్రంగా జీవించడం నేర్పిందని, దుబాయ్ నెట్‌వర్కింగ్ విలువను తెలియజేసిందని తేజు వివరించారు. కొత్త నగరానికి మారడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, ఒంటరితనం, కొత్త వ్యక్తులను కలవడం, ఉద్యోగం కోసం ప్రయత్నించడం వంటి అనుభవాలే మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఆమె వీడియో ద్వారా చెప్పిన సందేశం సోషల్ మీడియాలో పలువురిని ఆకట్టుకుంది.
తేజు షేర్ చేసిన ఈ వ్యక్తిగత అనుభవంపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా కొత్త నగరాల్లో జీవించడం ద్వారా తాము కూడా ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నామని పలువురు కామెంట్లలో తమ అనుభవాలను పంచుకుంటున్నారు.