
రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) మరో భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లలో 2026-27 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1599 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 26, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, ప్లంబర్, బ్లాక్‌స్మిత్, గ్రైండర్, వైర్‌మన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA), లేబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ) తదితర ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 10వ తరగతి (మెట్రిక్యులేషన్)/ ఇంటర్ లేదా ఐటీఐలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత అవసరమైన పోస్టులకు అభ్యర్థులు నిర్దేశిత ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి సెప్టెంబరు 15, 2026వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
ఈ అర్హతలు కలిగిన వారు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 15, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు సమయంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్లికేషన్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. అభ్యర్థులకు ప్రత్యేకంగా ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి అప్రెంటిస్‌లను ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించవచ్చు.
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.