AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9వ తరగతిలో మంచి మార్కులు.. కొడుకుకు రూ.2.30 కోట్ల BMW కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తండ్రి!

సాధారణంగా పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే తల్లిదండ్రులు సైకిల్, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి బహుమతులు ఇస్తుంటారు. కానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మాత్రం తన కుమారుడికి ఏకంగా రూ.2.30 కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచారు..

9వ తరగతిలో మంచి మార్కులు.. కొడుకుకు రూ.2.30 కోట్ల BMW కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తండ్రి!
Man Gifts Luxury Bmw M4 Competition To 9th Class Son
Srilakshmi C
|

Updated on: Nov 13, 2026 | 8:15 AM

Share

పశ్చిమ బెంగాల్, నవంబర్ 13: తొమ్మిదో తరగతి అర్ధ సంవత్సర పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందుకు కుమారుడి చిరకాల కోరికను నెరవేర్చారు. పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లా గాల్సీ ప్రాంతంలోని పరాజ్‌కు చెందిన షంసుద్దీన్ మిద్యా ఓ వ్యాపారవేత్త. ఆయన కుమారుడు మొహమ్మద్ తల్హా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల జరిగిన అర్ధ సంవత్సర పరీక్షల్లో తల్హా మంచి మార్కులు సాధించాడు. దీంతో కుమారుడిని ప్రత్యేకంగా అభినందించాలని భావించిన తండ్రి.. అతడి చిరకాల కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ముంబైకి వెళ్లి సుమారు రూ.2.30 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్ (BMW M4 Competition) కారును కొనుగోలు చేసి కుమారుడికి బహుమతిగా ఇచ్చారు.

ఇప్పటికే లగ్జరీ కార్ల కలెక్షన్

షంసుద్దీన్‌కు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే ఆయన వద్ద రేంజ్ రోవర్, వోల్వో, మహీంద్రా థార్, హ్యుందాయ్ అల్కజార్ వంటి కార్లు ఉన్నట్లు సమాచారం. తాజాగా కుమారుడి కోసం కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు ఆయన కార్ల కలెక్షన్‌లో ప్రత్యేకంగా నిలిచింది. షంసుద్దీన్‌కు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల విషయంలోనూ ఓ ప్రత్యేకమైన అభిరుచి ఉంది. ఆయన వద్ద ఉన్న పలు కార్ల నంబర్ల చివరి మూడు అంకెలు 555గా ఉంటాయని సమాచారం. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వాహనాల నంబర్లలోనూ ఇదే అంకెల కలయిక ఉండటం విశేషం. కేవలం లగ్జరీ కార్లపైనే కాకుండా సామాజిక సేవపైనా షంసుద్దీన్‌కు ఆసక్తి ఉందని తెలుస్తోంది. పేదలు, అవసరంలో ఉన్నవారికి తన గుర్తింపు బయటపడకుండా కూడా సహాయం చేస్తుంటారని సమాచారం.

కోట్ల విలువైన కారు బహుమతిగా అందుకున్నప్పటికీ తల్హా మాత్రం తన చదువుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రస్తుతం చదువుపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అయితే తన కలల కారులో ప్రయాణించాలనే కోరిక మాత్రం ఉంది. వారానికి ఒకసారి బీఎండబ్ల్యూ కారులో రైడ్‌కు వెళ్లాలని తల్హా అనుకుంటున్నాడు. తండ్రి డ్రైవింగ్ చేస్తుండగా, పక్కన కూర్చుని ప్రయాణాన్ని ఆస్వాదించనున్నాడు. తొమ్మిదో తరగతి అర్ధ సంవత్సర పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందుకు రూ.2.30 కోట్ల విలువైన కారు బహుమతిగా అందుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొడుకు చిరకాల కోరికను తీర్చిన తండ్రి నిర్ణయం సోషల్ మీడియాలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు ఇంత ఖరీదైన బహుమతి అందుకున్నా చదువుకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన తల్హా వైఖరి కూడా పలువురిని ఆకట్టుకుంటోంది.

Follow Us