దేశంలో డిజిటలైజేషన్ ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. 5జీ నెట్‌వర్క్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు శరవేగంగా దేశమంతా వ్యాపిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో భారీగా ఉద్యోగాలు రానున్నట్లు నివేదికలు చెబుతున్నారు. రానున్న ఐదేళ్లలో ఫైబర్ ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్, రిపేర్ వంటి విభాగాల్లో కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సుబ్బురథినం.పి తెలిపారు.
2024లో భారత టెలికాం రంగం విలువ 48.61 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. 2029 నాటికి ఇది 76.16 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. వార్షికం 9.40 శాతం వృద్ధి చెందుతోంది. అదే విధంగా 2023 నాటికి దేశంలో సుమారు 7,00,000 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను వేశారు. దేశవ్యాప్తంగా డిజిటలైజేషన్‌కు ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని సబ్బురథినం తెలిపారు. ఫైబర్ ఆప్టిక్ టెక్నీషియన్స్ విభాగంలో ఉపాధి వృద్ధి రేటుకు బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు 5జీ నెట్‌వర్క్ విస్తరణ దోహదపడుతోందని, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించడంపై దృష్టి సారించినందున ఫైబర్ టెక్నీషియన్ల డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పెరుగుతున్న టెలికాం టవర్ల ఫైబర్‌లీకరణ వల్ల దాదాపు లక్ష కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 4జీ, 5జీ నెట్‌వర్క్‌లతో సమానంగా ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌లను వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలో ఫైబర్ టెక్నీషియన్ల సంఖ్య 5 లక్షలకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2023 నాటికి దేశంలో 5జీ సాంకేతికత పీక్స్‌కి చేరుకుంటుందని, ప్రజలకు మరింత మెరుగైన ఇంటర్నెట్ సేవలు లభిస్తాయని సుబ్బురథినం తెలిపారు.
ఫైబర్ టెక్నీషియన్లు, టెలికమ్యూనికేషన్స్, ఐటి రంగాల్లో ఉపాధి లభిస్తుందని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయని అన్నారు. సుబ్బురథినం ఈ విషయమై ఇంకా మాట్లాడుతూ.. ఫైబర్ ఇంజనీర్లు, స్ప్లైసర్‌లు, ఫైబర్ టెర్మినేషన్ ఎక్విప్‌మెంట్ టెక్నీషియన్‌లు, ఇన్‌స్టాలేషన్, రిపేర్, ఫాల్ట్ రిజల్యూషన్ టీమ్, ఫైబర్ సెల్‌సైట్ ఇంజనీర్లు, ఫీల్డ్ టెక్నీషియన్‌లు వంటి వారు టెలికం మౌలిక సదుపాయాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..