AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Exams: పదో తరగతి పరీక్షల్లో కొత్త విధానం.. తొలిసారిగా ప్రత్యేక పరిశీలకుల నియామకం!

ఏపీలో పదో తరగతి సమ్మెటివ్-1 పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ప్రత్యేక ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించింది. పరీక్షల నిర్వహణతో పాటు జవాబు పత్రాల మూల్యాంకనం, లీప్ యాప్‌లో మార్కుల నమోదును వీరు పర్యవేక్షించనున్నారు. నవంబర్ 27లోగా అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది..

AP 10th Exams: పదో తరగతి పరీక్షల్లో కొత్త విధానం.. తొలిసారిగా ప్రత్యేక పరిశీలకుల నియామకం!
AP SSC Summative 1 Exams
Srilakshmi C
|

Updated on: Nov 11, 2026 | 8:02 AM

Share

అమరావతి, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న సమ్మెటివ్-1 పరీక్షల విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు మూల్యాంకన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించింది. పాఠశాల స్థాయి పరీక్షలకు ప్రత్యేక పరిశీలకులను నియమించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం విశేషం. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలకు, పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల ఫలితాలకు మధ్య వ్యత్యాసం ఉంటుండటంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ప్రతిభను కచ్చితంగా అంచనా వేయడంతో పాటు పరీక్షలు, జవాబు పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి సమ్మెటివ్-1 పరీక్షలు నవంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నవంబర్ 18 వరకు కొనసాగనున్నాయి. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించారు. మొదటి మూడు రోజులు నిర్వహించే భాషా సబ్జెక్టుల పరీక్షలకు భాషేతర స్కూల్ అసిస్టెంట్లను పరిశీలకులుగా నియమించారు. భాషేతర సబ్జెక్టుల పరీక్షల సమయంలో భాషా సబ్జెక్టు ఉపాధ్యాయులు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. వీరు కేవలం పరీక్షల నిర్వహణనే కాకుండా జవాబు పత్రాల మూల్యాంకనం, లీప్ యాప్‌లో మార్కుల నమోదును కూడా పర్యవేక్షించనున్నారు. సాధారణంగా పొరుగు మండలాలకు చెందిన ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో 15 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోందని ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో అదే మండల పరిధిలోని ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించుకునే వెసులుబాటును జిల్లా విద్యాశాఖ అధికారులకు (డీఈఓలు) కల్పించారు. పరిశీలకులు తమ విధులకు సక్రమంగా హాజరవుతున్నారా లేదా అనే విషయాన్ని తనిఖీ చేసే బాధ్యతలను జిల్లా నోడల్ అధికారులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

వారం రోజుల్లో మూల్యాంకన ప్రక్రియ పూర్తి..

  • పరీక్షలు పూర్తయిన తర్వాత జవాబు పత్రాల మూల్యాంకనానికి విద్యాశాఖ ప్రత్యేక విధానాన్ని రూపొందించింది.
  • పరీక్ష పూర్తైన మూడు పని దినాల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు తమ పాఠశాలలోనే జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి.
  • ప్రతి విద్యార్థి మార్కులను రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
  • జవాబు పత్రాలు, మార్కుల రిజిస్టర్లు ప్రధానోపాధ్యాయుడి ఆధీనంలో ఉండాలి.
  • మూల్యాంకనం పూర్తయిన నాలుగో రోజున అదే సబ్జెక్టుకు చెందిన మరో పాఠశాల ఉపాధ్యాయుడిని పరిశీలకుడిగా నియమిస్తారు.
  • పరిశీలకుడు మూల్యాంకన ప్రక్రియను తనిఖీ చేయడంతో పాటు 5 శాతం లేదా కనీసం ఐదు జవాబు పత్రాలను పరిశీలించాలి.
  • అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించిన తర్వాత లీప్ యాప్‌లో మార్కులను నమోదు చేస్తారు.
  • తనిఖీ సమయంలో గుర్తించిన అంశాలపై అదే రోజు మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈఓలకు) నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, సమాధాన పత్రాల తనిఖీ, లీప్ యాప్‌లో మార్కుల నమోదు.. ఇలా ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక గడువులను విద్యాశాఖ నిర్ణయించింది. నవంబర్ 18తో పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో పరీక్షలకు సంబంధించిన అన్ని ప్రక్రియలను నవంబర్ 27లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ కొత్త విధానం ద్వారా పదో తరగతి విద్యార్థుల మూల్యాంకనంలో పారదర్శకత పెరుగుతుందని, పాఠశాల స్థాయి పరీక్షల ఫలితాలు మరింత నాణ్యంగా ఉంటాయని విద్యాశాఖ భావిస్తోంది.

Follow Us