AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాల తేదీ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే..?
AP Inter Exam Results 2026: ఏపీ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ నెల 18 లేదా 19 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తవగా, ఫలితాల ప్రాసెస్ ఈ నెల 16 నాటికి ముగియనుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు జరిగిన ఈ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. పరీక్షా పత్రాల సరిదిద్దడం, మార్కుల నమోదు వంటి కీలక దశలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫలితాల విడుదలకు సంబంధించిన తుది ప్రక్రియ కొనసాగుతోంది.
విద్యార్థుల మార్కుల డేటా ప్రాసెసింగ్, వెరిఫికేషన్ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలు ఈ నెల 16 నాటికి పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై మార్చి 23 వరకు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
