House Construction: గోడల్లో పగుళ్లు ఎందుకు వస్తాయి? ఇంటి నిర్మాణంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

House Walls Cracks: పునాదుల పరిమాణం సరిగా లేకపోవడం, ప్లింత్ బీమ్‌లు సరిగ్గా డిజైన్ చేయకపోవడం లేదా నాణ్యత లేని కాంక్రీట్, స్టీల్ వాడటం వల్ల అవి బలహీనపడి, వాటిపై ఉన్న గోడలు, కాలమ్‌లలో పగుళ్లు వస్తాయి. ప్లింత్ బీమ్ అనేది నిర్మాణానికి పటిష్టతను ఇస్తుంది..

House Construction: గోడల్లో పగుళ్లు ఎందుకు వస్తాయి? ఇంటి నిర్మాణంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
House Construction

Updated on: Sep 14, 2026 | 9:53 PM

House Walls Cracks: భవనాలలో పగుళ్లు చాలా సాధారణ సమస్య. ఇవి గోడలు, ప్లాస్టరింగ్, బేస్‌మెంట్‌లు, బీమ్‌లు, స్లాబ్‌లు, కాలమ్‌లలో కనిపిస్తాయి. చాలామంది పగుళ్లు వచ్చినప్పుడు కేవలం తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే చూస్తుంటారు. కానీ వాటి మూలకారణాన్ని గుర్తించి పరిష్కరించకపోతే అవి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. పగుళ్లను రెండు ప్రధాన రకాలుగా విభజించవచ్చు. స్ట్రక్చరల్, నాన్-స్ట్రక్చరల్. స్ట్రక్చరల్ పగుళ్లు భవన స్థిరత్వానికి ప్రమాదకరమైనవి. అయితే నాన్-స్ట్రక్చరల్ పగుళ్లు సాధారణంగా మైనర్‌గా ఉంటాయి. ఈ సమస్యను సమగ్రంగా అర్థం చేసుకోవడం, నివారణ చర్యలు తీసుకోవడం ఇంటి యజమానులకు, సివిల్ ఇంజనీర్లకు, నిర్మాణ విద్యార్థులకు చాలా అవసరం. అయితే మేస్త్రీలు, బిల్డర్స్‌ తెలిపిన వివరాల ప్రకారం..

పగుళ్లకు ప్రధాన కారణాలు:

1. మట్టి సెటిల్‌మెంట్):

భవన నిర్మాణం ప్రారంభించే ముందు మట్టి సేఫ్ బేరింగ్ కెపాసిటీ (ఎస్బిసి)ని సరిగ్గా లెక్కించకపోతే, మట్టి భవనం బరువును భరించలేక కుంగిపోతుంది. దీనివల్ల ఫుట్టింగ్‌లు, కాలమ్‌లు అన్నీ కుంగిపోయి గోడలు, బీమ్‌లు, స్లాబ్‌లలో స్ట్రక్చరల్ పగుళ్లు ఏర్పడతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.

2. పునాది, ప్లింత్ బీమ్ సమస్యలు:

పునాదుల పరిమాణం సరిగా లేకపోవడం, ప్లింత్ బీమ్‌లు సరిగ్గా డిజైన్ చేయకపోవడం లేదా నాణ్యత లేని కాంక్రీట్, స్టీల్ వాడటం వల్ల అవి బలహీనపడి, వాటిపై ఉన్న గోడలు, కాలమ్‌లలో పగుళ్లు వస్తాయి. ప్లింత్ బీమ్ అనేది నిర్మాణానికి పటిష్టతను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

3. నాణ్యత లేని నిర్మాణ సామగ్రి:

  • ఇటుకలు: నాణ్యత లేని ఇటుకలు లోడ్ పడినప్పుడు పగిలిపోయి గోడలలో పగుళ్లకు దారితీస్తాయి. అలాగే, ఇటుకలు ఒకే సైజులో లేకపోతే ప్లాస్టరింగ్‌లో అన్‌ఈవెన్‌నెస్‌ ఏర్పడి పగుళ్లు వస్తాయి.
  • సిమెంట్: గడువు ముగిసిన సిమెంట్‌ను వాడటం వల్ల దాని బలం తగ్గి పగుళ్లకు దారితీస్తుంది. గోడలు, ప్లాస్టరింగ్‌కు పిపిసి (PPC) సిమెంట్‌ను ఉపయోగించడం మంచిది.

4. నిర్మాణ పద్ధతులలో లోపాలు:

  • ఇటుకలను తడపకపోవడం: గోడలు కట్టే ముందు ఇటుకలను తడపకపోతే, అవి సిమెంట్ మోర్టార్‌లోని నీటిని పీల్చుకొని, మోర్టార్ త్వరగా ఆరిపోయి పగుళ్లు వస్తాయి.
  • క్యూరింగ్ (Curing): గోడలు కట్టిన తర్వాత, ప్లాస్టరింగ్ చేసిన తర్వాత కనీసం 7-14 రోజుల పాటు సరిగ్గా క్యూరింగ్ చేయకపోతే, కాంక్రీట్ లేదా మోర్టార్‌లో తగినంత బలం రాక పగుళ్లు ఏర్పడతాయి.
  • కాంక్రీట్ బ్యాండ్స్: గోడల నిర్మాణంలో కాంక్రీట్ బ్యాండ్స్ (కనీసం 9 అంగుళాల గోడకు ఒకటి, 4 అంగుళాల గోడకు రెండు) వేయకపోతే, లోడ్ సరిగా ట్రాన్స్‌ఫర్ కాక పగుళ్లు వస్తాయి.
  • లింటెల్స్: కిటికీలు, తలుపుల పైన లింటెల్స్ సరిగా వేయకపోతే వాటిపై ఉన్న గోడల బరువు డోర్/విండో ఫ్రేమ్‌లపై పడి, అవి వంగిపోయి పైన పగుళ్లు వస్తాయి. లింటెల్స్ కనీసం డోర్/విండో వెడల్పు కంటే 6 అంగుళాలు అదనంగా ఉండాలి.
  • మిక్స్ రేషియో: బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్ మిక్స్‌లో సిమెంట్, ఇసుక నిష్పత్తి సరిగా లేకపోతే నాణ్యత తగ్గి పగుళ్లు వస్తాయి. మిక్స్ తయారు చేసిన అరగంట లోపు వాడాలి.
  • హ్యాకింగ్/చిప్పింగ్: స్లాబ్‌లకు ప్లాస్టరింగ్ చేసే ముందు కింద హ్యాకింగ్ లేదా చిప్పింగ్ చేయకపోతే, ప్లాస్టరింగ్ సరిగా అంటుకోక, ఊడిపోవడం లేదా పగుళ్లు రావడం జరుగుతుంది.
  • రాబిట్ మెష్: కరెంట్ పైపులు, కాలమ్‌లు, బీమ్‌లు, గోడల జాయింట్ల వద్ద ప్లాస్టరింగ్ చేసేటప్పుడు చికెన్ మెష్ లేదా రాబిట్ మెష్ వాడకపోతే ఆ ప్రాంతాల్లో పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ.
  • డబల్ కోట్ ప్లాస్టరింగ్: సింగిల్ కోట్ ప్లాస్టరింగ్ కన్నా డబల్ కోట్ ప్లాస్టరింగ్ చేయడం వల్ల పగుళ్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

పగుళ్లను నివారించడం ఎలా?

  • నిర్మాణానికి ముందు మట్టి పరీక్ష (ఎస్బిసి టెస్ట్) తప్పనిసరిగా చేయించాలి.
  • నాణ్యత గల ఇటుకలు, సిమెంట్, ఇతర సామగ్రిని మాత్రమే ఉపయోగించాలి.
  • ప్లింత్ బీమ్‌లు, లింటెల్స్, కాంక్రీట్ బ్యాండ్‌లను సరైన డిజైన్ ప్రకారం నిర్మించాలి.
  • ఇటుకలను ముందుగా తడిపి గోడలు కట్టాలి. క్యూరింగ్‌ను నిరంతరం చేయాలి.
  • ప్లాస్టరింగ్ మిక్స్‌లో సరైన నిష్పత్తిని పాటించి, ప్లాస్టరింగ్ చేసే ముందు గోడలను తడపాలి.
  • స్లాబ్‌లకు హ్యాకింగ్/చిప్పింగ్,జాయింట్ల వద్ద రాబిట్ మెష్ వాడాలి.
  • అవసరమైతే విండోస్ కింద కూడా బెడ్ లింటెల్స్ వేయాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవనాలలో పగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చని, భవన జీవితకాలాన్ని పెంచవచ్చని నిపుణలు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Auto Tips: ఇది మీకు తెలుసా..?కారు స్టార్ట్ చేసిన వెంటనే ఏసీ ఎందుకు ఆన్ చేయకూడదు?

ఇది కూడా చదవండి: Chicken: వండిన చికెన్ ఫ్రిజ్‌లో పెడితే ఎన్ని రోజులు పాడవకుండా ఉంటుంది? ఎన్ని రోజుల్లోపే తినాలి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us