సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి కల. తమ ఆదాయానికి అనుగుణంగా ఇల్లు, ఫ్లాట్ ను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ల పై ఆధారపడతారు. ప్రతినెలా వాయిదాల రూపంలో ఈఎంఐలు కట్టేలా రుణాలను తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్లకు అన్ని బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. కానీ అన్ రిజిస్టర్డ్ ఫ్లాట్లకు రుణాలు ఇస్తారా? వాటిని కోనుగోలు చేస్తే కలిగే ఇబ్బందులు వస్తాయా? వాటిపై లోన్లు కావాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
ప్రభుత్వానికి సంబంధించిన స్థానిక ఆస్తి రిజిస్ట్రీల కింద అధికారికంగా నమోదు చేయబడని వాటినే అన్ రిజిస్టర్డ్ ఆస్తులు అంటారు. వాటి నిర్మాణం పూర్తి కాకపోవడం, పత్రాల పని ఇంకా పురోగతిలో ఉండడం, ఆస్తిని నమోదు చేయడానికి యజమాని ఇష్టపడకపోవడం తదితర అంశాలు దానికి కారణం కావచ్చు. ఏదిఏమైనా ఆస్తి రిజిస్ట్రేషన్ అనేది కేవలం చట్టపరమైన అవసరం మాత్రమే కాదు. దాని యజమాని ప్రామాణికతను కూడా తెలియజేస్తుంది. ఆ ఆస్తిపై వివాదాలు, పునఃవిక్రయంలో ఇబ్బందులు కూడా కారణమవుతాయి.
హోమ్ లోన్లను మంజూరు చేసే బ్యాంకులు, ఇతర రుణదాతలు చట్టబద్ధంగా డాక్యుమెంట్లు కలిగిన ఆస్తులపై రుణాలను మంజూరు చేస్తాయి. ఎందుకంటే రుణం ఇచ్చేటప్పుడు వారు ప్రాథమికంగా నిర్ధారించుకునే అంశం అదే. లేకపోతే ఆర్థిక నష్టాలతో పాటు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆస్తికి సంబంధించి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు వారు మంజూరు చేసిన రుణానికి భద్రతగా ఉంటాయి.
సాధారణంగా బ్యాంకులు రిస్క్‌తో కూడుకున్న అన్ రిజిస్టర్డ్ ఆస్తులపై రుణాలు మంజూరు చేయవు. రిజిస్ట్రేషన్ కాలేదంటే దానికి వెనుక ఏవో పెద్ద కారణాలు ఉండే అవకాశం ఉంది. నిర్మాణ చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించారా, అక్రమ నిర్మాణమా, దానిపై చట్టపరమైన వివాదాల ఉన్నాయా అనే అంశాలు తెరపైకివస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నిపుణులు మొట్ట మొదటిగా పరిశీలించే అంశం ఆ ఆస్తికి సంబంధించిన చట్టబద్దత.
అన్ రిజిస్టర్డ్ ఆస్తుల భద్రతపై వివిధ ఆందోళనల కారణంగా వాటిపై రుణాలు ఇవ్వడానికి రుణదాతలు ఇష్టపడరు. అందువల్ల హోమ్ లోన్ తీసుకునేవారు ముందుగా తాము కొనుగోలు చేయాలనుకునే ఫ్లాట్ ను ఎందుకు రిజిస్టర్ చేయలేదో పరిశీలించాలి. ముఖ్యంగా వివాదాలు, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో ఆరా తీయాలి.
రిజిస్టర్ చేయని ఫ్లాట్‌పై హోమ్ లోన్ పొందడం అసాధ్యమని చెప్పలేం. ఎందుకంటే కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్ బీఎఫ్ సీలు), ప్రైవేట్ ఫైనాన్షియర్‌లు అటువంటి ఆస్తులపై రుణాలను అందించే అవకాశం కూడా ఉంది. కానీ రిస్క్ కారణంగా వారు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తారు. ఏది ఏమైనా రిజిస్టర్డ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడమే శ్రేయస్కరం. అవి ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా గృహ రుణం మంజూరు చేయవు. మీరు అందించిన దరఖాస్తును కూడా అంగీకరించవు. హోమ్ లోన్ ప్రాసెసింగ్ కు అవసరమైన మొదటి పత్రం కూడా అదే.
అన్ రిజిస్టర్డ్ ఫ్లాట్‌పై గృహ రుణాలను ఎన్ బీఎఫ్ సీలు, ప్రైవేట్ ఫైనాన్షియర్లు అందించే వీలున్నప్పటికీ, నిపుణులు దానిని సిఫారసు చేయరు. అటువంటి ఆస్తిని కొనుగోలు చేసేముందు రియల్ ఎస్టేట్ న్యాయవాది, ఆర్థిక సలహాదారుని సంప్రదించడం చాలా అవసరం. వాటివల్ల కలిగే నష్టాలు, చిక్కులను అర్థం చేసుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..