దేశంలో ఒకప్పుడు రైలు ప్రయాణం అంటేనే జీవితకాలం ఆలస్యం అన్న నానుడి ఉండేది. దేశ జనాభాలో అత్యధికభాగం రైలు ప్రయాణాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితిలో రైల్వే వ్యవస్థను దేశానికి నాడీవ్యవస్థగా అభివర్ణిస్తాం. అలాంటి రైల్వే వ్యవస్థ దశాబ్దాలుగా ఆధునీకరణకు నోచుకోలేకపోయింది. గత పదేళ్లలో దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతూ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిన క్రమంలో రైల్వే రంగం కూడా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో శరవేగంగా దూసుకెళ్లే వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వేగంతో పాటు అధునాతన సదుపాయాలు కలిగిన ఈ రైళ్లు విశేష ప్రజాదరణ పొందాయి. అయితే వందేభారత్ రైళ్లను గరిష్టంగా 8 – 9 గంటల నిడివితో పగటి ప్రయాణాలకు మాత్రమే ఉపయోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇందులో సౌకర్యవంతంగా కూర్చునే వెసులుబాటు ఉంటుంది తప్ప పడుకుని ప్రయాణం చేసే అవకాశం లేదు. కానీ సుదూర ప్రయాణాలు చేయాలంటే రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి వేగవంతమైన స్లీపర్ సదుపాయం కల్గిన రైళ్లు మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని మించిన వేగంతో ప్రయాణించగలిగే రైళ్లు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాత్రిపూట పడుకుని ప్రయాణం చేసే సదుపాయంలో పరుగులు తీసే వందేభారత్ స్లీపర్ రైళ్లను డిజైన్ చేసింది. ఇప్పుడు ఆ ట్రైన్ ప్రయోగాత్మక పరీక్షలు జరుపుకుంటోంది. గంటకు గరిష్టంగా 180 కి.మీ వేగంతో పరుగులు తీసేలా వీటిని రూపొందించారు.
వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రయోగాత్మక పరీక్షల కోసం రైల్వే శాఖ సిద్ధం చేసింది. టెస్ట్ రన్‌లో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది, ప్రజావసరాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో వందేభారత్ స్లీపర్ రైళ్లను పరీక్షిస్తోంది. పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలో లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ఈ పరీక్షలను జరుపుతోంది. గత నెలలో ఉత్త మధ్య రైల్వే జోన్‌లోని ఝాన్సీ డివిజన్‌లో తొలి దశలో వందేభారత్ స్లీపర్ ట్రైన్‌ను పట్టాలెక్కించారు. రెండో దశలో భాగంగా కోటా (రాజస్థాన్)లో జరిగిన ట్రయల్ రన్‌లో వందేభారత్ స్లీపర్ రైలు గరిష్ట వేగం 180 కి.మీ అందుకుంది. ఈ రైలు ప్రయాణంలో కనిష్టంగా గంటకు 130 కి.మీ నుంచి గరిష్టంగా గంటకు 180 కి.మీ వేగం మధ్య నడిచినట్టు RDSO అధికారులు వెల్లడించారు. ట్రయల్ రన్‌లో భాగంగా ట్రైన్‌కు సంబంధించిన అన్ని కోచ్‌లలో ప్రయాణికుల బరువుకు సమానమైన బరువులను ఉంచి పట్టాలపై పరుగులు తీయించారు. దీంతో పాటు అనేక ఇతర సాంకేతిక అంశాలను సైతం అధికారులు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ట్రయల్ రన్ విజయవంతమైందా లేదా అన్నది తేల్చుతారు. ఈ ట్రయల్ రన్‌కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Vande Bharat (Sleeper) testing at 180 kmph pic.twitter.com/ruVaR3NNOt
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2025
కేంద్ర మంత్రి పోస్ట్ చేసిన ఈ వీడియోలో నీటి గ్లాసు, పక్కనే మొబైల్ ఫోన్‌లో వేగాన్ని కొలిచే యాప్ రన్ కనిపించాయి. గంటకు 180 కి.మీ వేగాన్ని చేరుకున్నప్పటికీ నీటి గ్లాసు తొణకకుండా కనిపించింది. అంటే అంత వేగంలోనూ కుదుపులు లేని ప్రయాణాన్ని ఈ రైలు అందిస్తుందన్న భరోసా కల్పిస్తోంది. ఝాన్సీ డివిజన్‌లో నిర్వహించిన తొలి దశ ట్రయల్ రన్‌లో భాగంగా ఖాళీ రైలును, ప్రయాణికుల బరువుతో సమానమైన బరువులు పెట్టిన రైలును కూడా పట్టాలపై పరీక్షించి చూశారు. ఈ రెండు దశల్లో నిర్వహించిన ట్రయల్ రన్ ఫలితాలను సమీక్షించి అందుబాటులోకి తీసుకొచ్చే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు.
అత్యధిక వేగంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని 2023-24 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని నిజం చేసే క్రమంలో ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోంది. అయితే ఈ రైళ్లను ఏ మార్గాల్లో నడుపుతారన్న విషయంపై స్పష్టత లేదు. అత్యధికవేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం రైలుకు ఉన్నా.. అది ప్రయాణించే మార్గానికి కూడా ఉండాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా గత పదేళ్లలో సెమీ హైస్పీడ్, హైస్పీడ్ ప్రయాణాకలకు అనుకూలంగా రైల్వే ట్రాక్‌ను కూడా రైల్వే శాఖ ఆధునీకరిస్తూ వచ్చింది. ఈ ట్రాక్‌లు ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో.. ఆ మార్గాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో న్యూఢిల్లీ – పూణే, న్యూఢిల్లీ – శ్రీనగర్ మార్గాలతో పాటు మరికొన్ని మార్గాలు పరిశీలనలో ఉన్నాయి. కాశ్మీర్ లోయను మిగతా ప్రపంచంతో అనుసంధానించే అద్భుతమైన రైల్వే బ్రిడ్జిని కూడా రైల్వే శాఖ ఈ మధ్యనే పరీక్షించింది. త్వరలోనే శ్రీనగర్‌ను దేశంలోని ఇతర నగరాలతో నేరుగా రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. అయితే కేంద్రం ఈ నగరానికి వందేభారత్ స్లీపర్ వంటి అధునాతన రైలుతోనే అనుసంధానించాలని చూస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి