AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాలర్ ఢమాల్..! ప్రపంచ దేశాలకు రాబర్ట్ కియోసాకి వార్నింగ్.. వాటిని కొనాలని సూచన..

ప్రపంచ మార్కెట్లను శాసిస్తున్న అమెరికా డాలర్ సామ్రాజ్యం కూలిపోనుందా? దశాబ్దాలుగా రారాజుగా వెలుగొందుతున్న గ్లోబల్ కరెన్సీకి కాలం చెల్లిందా? రిచ్ డాడ్ పూర్ డాడ్ ప్రసిద్ధ రచయిత రాబర్ట్ కియోసాకి అవుననే సమాధానం చెబుతున్నారు. డాలర్ అనేది ఒక ఫేక్ డబ్బు అని తేల్చేస్తూ.. అది వేగంగా పతనమవడానికి గల షాకింగ్ కారణాలను ఆయన బయటపెట్టారు.

డాలర్ ఢమాల్..! ప్రపంచ దేశాలకు రాబర్ట్ కియోసాకి వార్నింగ్.. వాటిని కొనాలని సూచన..
Robert Kiyosaki Warns Us Dollar Is Fake Money
Krishna S
|

Updated on: May 25, 2026 | 8:06 PM

Share

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా రారాజుగా వెలుగొందుతున్న అమెరికన్ డాలర్ బలంపై మరోసారి అంతర్జాతీయంగా పెద్ద చర్చ చెలరేగింది. ప్రసిద్ధ ఫైనాన్షియల్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ దేశాలను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యూఎస్ డాలర్ బలహీనపడే ప్రమాదం ఊహించిన దానికంటే వేగంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు వాణిజ్యంలో వస్తున్న మార్పులే ఇందుకు ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు.

డాలర్‌కు చెక్.. రంగంలోకి చైనీస్ యువాన్..

రాబర్ట్ కియోసాకి తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ ఇప్పుడు తన చమురు విక్రయాల చెల్లింపులను అమెరికన్ డాలర్లకు బదులుగా చైనీస్ యువాన్లలో స్వీకరించడం ప్రారంభించింది. ఇది కేవలం ఒక చిన్న ద్వైపాక్షిక మార్పు కాదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలించే ఒక బలమైన సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రాబోయే ఈ భారీ ఆర్థిక మార్పులను తట్టుకోవడానికి ప్రజలు ఇప్పటి నుంచే ఆర్థిక విద్యపై దృష్టి సారించి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.

ముప్పులో పెట్రోడాలర్ వ్యవస్థ

బిలియనీర్ ఇన్వెస్టర్ రే డాలియో ఒక పాడ్‌కాస్ట్‌ను ఉటంకిస్తూ.. ప్రపంచం ఒక కీలక మలుపుకు చేరుకుంటోందని కియోసాకి అన్నారు. చాలా సంవత్సరాలుగా ప్రపంచంలోని చమురు వాణిజ్యంలో సింహభాగం యూఎస్ డాలర్లలోనే జరుగుతూ వచ్చింది.. దీనినే పెట్రోడాలర్ వ్యవస్థ అంటారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా డాలర్‌కు నిరంతర డిమాండ్ ఏర్పడి, అది బలపడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇరాన్ వంటి చమురు ఉత్పాదక దేశాలు కొనుగోలు, అమ్మకాల కోసం డాలర్ కాకుండా ఇతర కరెన్సీలను ఉపయోగించడం ప్రారంభిస్తే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ భారీగా పడిపోతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ తీస్తుంది. డాలియో ప్రకారం.. దీనివల్ల అమెరికాపై రుణ భారం విపరీతంగా పెరిగి, వడ్డీ రేట్లు మరింత అధికమవుతాయి. ఆ అప్పులను తీర్చడానికి అమెరికా మరిన్ని నోట్లను ముద్రించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

అమెరికాకు పెరుగుతున్న కష్టాలు

ఆర్థిక నివేదికల ప్రకారం.. 30 ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్లపై రాబడి ఇటీవల 5 శాతానికి పైగా చేరుకుంది. ఇది చాలా కాలంలోనే అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన స్థాయి. డాలర్ గనుక అంతర్జాతీయంగా బలం కోల్పోతే, అమెరికా తన అప్పులను నిర్వహించడం, దేశ ఆర్థిక వ్యవస్థను అదుపులో ఉంచడం మరింత కష్టతరం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు, ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపి, భవిష్యత్తులో పెద్ద ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చని కియోసాకి హెచ్చరించారు.

డాలర్ ఒక నకిలీ డబ్బు

రాబర్ట్ కియోసాకి చాలా కాలంగా అమెరికా డాలర్‌ను ఫేక్ మనీ అని విమర్శిస్తున్నారు. డాలర్ పతనమౌతున్న వేళ ప్రజలు తమ ఆస్తులను కాపాడుకోవడానికి బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొనుగోలు చేయాలని ఆయన నిరంతరం సలహా ఇస్తుంటారు. ఈ క్రమంలోనే కియోసాకి బంగారాన్ని దేవుని డబ్బు అని, బిట్‌కాయిన్‌ను ప్రజల డబ్బు అని పిలవడం విశేషం.

Follow Us