ETF: టాప్ సిల్వర్ ఈటీఎఫ్‌లు.. ఏడాది భారీ రాబడులు! వీటిలో పెట్టుబడి పెట్టొచ్చా?
గత ఏడాది సిల్వర్ ఈటీఎఫ్‌లు బంగారం కంటే మెరుగైన రాబడులు అందించాయి. ఫిజికల్ వెండి కొనుగోలు లేకుండానే స్టాక్ మార్కెట్ ద్వారా సులభంగా పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తున్నాయి. SBI సిల్వర్ ETF FoF అగ్రస్థానంలో నిలవగా, ఇతర ఫండ్లు కూడా గణనీయమైన లాభాలు చూపాయి.

గత కొన్ని నెలలుగా వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో వేగంగా పెరగడంతో, సిల్వర్ ఆధారిత పెట్టుబడులపై ఇన్వెస్టర్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా సిల్వర్ ఈటీఎఫ్‌లు గత ఏడాది కాలంలో ఆకర్షణీయమైన రాబడులను అందించి, బంగారం కంటే మెరుగైన పనితీరు కనబర్చాయి. ఫిజికల్‌గా వెండి కొనుగోలు చేయకుండా, స్టాక్ మార్కెట్ ద్వారా సులభంగా వెండిలో పెట్టుబడి పెట్టేందుకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి. ఇటీవల గణాంకాల ప్రకారం అత్యధిక రాబడిని అందించిన సిల్వర్ ETF ఫండ్‌లలో ఎస్‌బిఐ సిల్వర్ ETF FoF అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఫండ్ గత ఏడాదిలో సుమారు 152.32 శాతం రాబడిని అందించింది. దీని వ్యయ నిష్పత్తి 0.31 శాతం కాగా, NAV రూ.26.17గా ఉంది.
దీనికి సమీపంగా కోటక్ సిల్వర్ ETF FoF 151.09 శాతం రాబడిని అందించింది. UTI సిల్వర్ ETF FoF 149.66 శాతం, HDFC సిల్వర్ ETF FoF 149.56 శాతం, ICICI ప్రూడెన్షియల్ సిల్వర్ ETF FoF 149.41 శాతం రాబడులను నమోదు చేశాయి. ఈ ఫండ్ల వ్యయ నిష్పత్తులు 0.17 శాతం నుంచి 0.24 శాతం మధ్య ఉండటం పెట్టుబడిదారులకు మరో ప్లస్ పాయింట్‌గా మారింది. అయితే గతంలో మంచి రాబడులు ఇచ్చిన ఫండ్ భవిష్యత్తులో కూడా అదే స్థాయి లాభాలను ఇస్తుందని హామీ ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సిల్వర్ ETFల పనితీరు పూర్తిగా అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్, డాలర్ మారకం విలువ, పరిశ్రమల డిమాండ్, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు కేవలం రాబడులను మాత్రమే కాకుండా వ్యయ నిష్పత్తి, రిస్క్ స్థాయి, మార్కెట్ హెచ్చుతగ్గులు వంటి అంశాలను కూడా పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో, సరైన డైవర్సిఫికేషన్‌తో పెట్టుబడి పెడితే సిల్వర్ ETFలు మంచి ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా ఉపయోగపడవచ్చని వారు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
