Bank Locker 1
బ్యాంకులు అందించే లాకర్ సదుపాయం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. విలువైన ఆభరణాలు, పత్రాలు, డాక్యుమెంట్లను దాచుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇంట్లో విలువైన వస్తువులను ఉంచుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దొంగతనాల భయం పొంచి ఉంటుంది. బ్యాంకు లాకర్లలో మన వస్తువులకు పూర్తి భద్రత ఉంటుంది. లాకర్లు ఉన్న రూమ్ లో నిఘా కెమెరాలు 24 గంటలూ పనిచేస్తాయి. సెక్యూరిటీ అప్రమత్తంగా ఉంటుంది. బయట వారు లోపలకు ప్రవేశించే అవకాశం ఉండదు. కాబట్టి అత్యంత విలువైన వస్తువులను దాచుకునేందుకు బ్యాంకు లాకర్ల చాలా ఉపయోగంగా ఉంటాయి. అయితే లాకర్లలో ఏ వస్తువులను దాచుకోవచ్చు. వాటికి నష్టం కలిగితే బాధ్యత ఎవరిది, నిబంధనలు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం.
ఆర్బీఐ నిబంధనలు..
బ్యాంకుల లాకర్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. వాటిని ఖాతాదారులు, బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలి. లాకర్లలో ఏ వస్తువులను దాచుకోవచ్చు. ఏదైనా దొంగతనం జరిగితే బ్యాంకుల బాధ్యత ఎంత వరకూ ఉంటుందని దానిపై విధానాలను రూపొందించింది.
ముఖ్యమైన అంశాలు..
- లాకర్ తో పాటు ఇతర సేవలను అందించడానికి కొన్ని బ్యాంకులు పొదుపు లేదా కరెంట్ ఖాతాను తెరవాలని ఖాతాదారులను కోరుతున్నాయి.
- బ్యాంకులో లాకర్ సదుపాయం కావాల్సిన వారు కొన్ని పత్రాలను సమర్పించాలి. అంటే వ్యక్తిగత గుర్తింపు, చిరునామా రుజువు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, లేటెస్ట్ ఫోటో అందజేయాల్సి ఉంటుంది.
- లాకర్ సేవ ఎలా ఉంటుంది. దానిలోని నిబంధనలు ఏమిటనే విషయాలను వివరిస్తూ ఒప్పంద పత్రాన్ని బ్యాంకు అందిస్తుంది. ఈ అగ్రిమెంట్ చట్టబద్ధంగా ప్రకారం ఉంటుంది. దీనిపై బ్యాంకు అధికారులు, ఖాతాదారులు కూడా సంతకాలు చేస్తారు.
- లాకర్లు అనేవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు అరలుగా ఉంటాయి. వాటిని కేటాయించినప్పుడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. లాకర్లు పూర్తిగా నిండిపోయినప్పుడు వెయిటింగ్ లిస్ట్ విధానం కూడా అమలవుతుంది. లాకర్ ను కేటాయించిన తర్వాత ఖాతాదారుడికి కీ నంబర్ అందజేస్తారు. అలాగే బ్యాంకు దగ్గర మాస్టర్ కీ ఉంటుంది.
- లాకర్ సదుపాయం వినియోగించున్న ఖాతాదారుడి నుంచి కొంత చార్జీ వసూలు చేస్తారు. ఆ చార్జీ కూడా ఆ బ్యాంకు ఉన్న ప్రదేశం, అద్దెకు ఇచ్చే లాకర్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
నష్టం జరిగితే..
- బ్యాంక్ లాకర్లలో దాచిన వస్తువులు సురక్షితంగా, భద్రంగా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఖాతాదారుడికి నష్టం కలిగినా నిబంధనల ప్రకారం బ్యాంకులకు బాధ్యత ఉండదు.
- బ్యాంకులోని సిబ్బంది వల్ల లాకర్లలోని వస్తువులకు నష్టం కలిగితే ఆయా బ్యాంకులు బాధ్యత వహిస్తాయి. అలాంటి సమయంలో మీ వస్తువు విలువకు సుమారు వంద రెట్లు అందజేయాల్సి ఉంటుంది.
- భూకంపం, వరదలు, మెరుపులు, ఉరుములతో సహా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు, కస్టమర్ నిర్లక్ష్యం వల్ల లాకర్లలో వస్తువులకు కలిగిన నష్టాలకు బ్యాంకు సంబంధం ఉండదు.
- లాకర్ తీసుకున్న సమయంలోనే ఖాతాదారుడు తన నామినీ వివరాలు తెలపాలి. అనుకోకుండా ఖాతాదారుడు మరణించిన సందర్భంలో లాకర్‌ను తెరవడానికి నామినీకి అనుమతి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..