GST: డీజిల్, పెట్రోల్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సెంచరీ దాటిన తరువాత కూడా ఇంకా వేగంగా పెరుగుతూనే వస్తున్నాయి. సామాన్య ప్రజలపై ఈ భారం చాలా ఎక్కువగా ఉంది. పెట్రోల్ పై టాక్స్ లు అధికంగా ఉండడంతోనే ఈ పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు కేంద్ర ప్రభుత్వం వైపు చాలా ఆశగా చూస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు కళ్ళెం వేసేందుకు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు. అయితే, వారి ఆశలను కేంద్ర ప్రభుత్వం తీర్చేలా కనిపించడం లేదు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకురావాలని ఇప్పటివరకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని ఆర్ధిక వ్యవహారాల సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి ఈ విధంగా చెప్పారు.
“పెట్రోల్, డీజిల్ చేర్చడం అనే సమస్యను జీఎస్టీ కౌన్సిల్ పరిగణించవచ్చు. ఇది ఆదాయ చిక్కులతో సహా అన్ని సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకుని తీసుకోవలసిన నిర్ణయం. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఏదీ జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చకు రాలేదు. ఎల్‌పిజికి సంబంధించి, ఇది ఇప్పటికే జిఎస్‌టి క్రింద ఉంది, ” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
బ్రాండ్ చేయని అదేవిధంగా, బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్‌పై విధించిన సుంకాలను మంత్రి ఆ ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం అన్ బ్రాండెడ్ పెట్రోల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం సెస్‌లతో సహా రూ. 32.90లు అలాగే, బ్రాండెడ్ పెట్రోల్ పై లీటరుకు 34.10 రూపాయలు ఉంది. ఇక అన్ బ్రాండెడ్ డీజిల్ పై సుంకం సేస్ లతో సహా రూ. 17.46లు అదేవిధంగా, బ్రాండెడ్ డీజిల్ పై లీటరుకు 18.64 రూపాయలుగానూ ఉన్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.
నగదు లావాదేవీలపై పరిమితి యధాతథం..
నగదు లావాదేవీల పరిమితిని పెంచడం గురించి వచ్చిన మరొక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, అలాంటి ప్రణాళిక ఏదీ ప్రస్తుతం లేదన్నారు. దేశాన్ని తక్కువ నగదు పై ఆధారపడే విధంగా చూడాలని ప్రభుత్వ నిర్ణయం అని చెప్పారు. “నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడం మరియు తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్ళడం ప్రభుత్వం ప్రకటించిన విధానం. అందువల్ల, ఆదాయపు పన్ను చట్టం 1961 లోని వివిధ నిబంధనల ప్రకారం అనుమతించదగిన నగదు లావాదేవీల పరిమితిని పెంచే ప్రతిపాదన లేదు” అని మంత్రి చెప్పారు.
Also Read: Central Employees: కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్: 9500 రూపాయల అదనపు ప్రయాణీకుల భత్యం..!