Gold Loan: 10 గ్రాముల బంగారానికి ఎంత లోన్ వస్తుంది..? బ్యాంకుల కొత్త లెక్క ఇదే..
ఇటీవల ఎక్కబట్టినా గోల్డ్ లోన్ గురించే చర్చ జరుగుతోంది, బంగారం ధరలు పెరగడంతో ఎక్కువ లోన్ వస్తుందనే కారణంతో చాలామంది అవసరాల కోసం గోల్డ్ లోన్ అనేది తీసుకుంటున్నారు. అయితే ఎంత బంగారానికి ఎంత మొత్తంలో లోన్ వస్తుందనేది చాలామందికి అవగాహన ఉండదు.

అత్యవసర ఆర్ధిక పరిస్థితుల క్రమంలో చాలామంది తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందుతూ ఉంటారు. అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేది గోల్డ్‌నే. ఇది ఒక ఆభరణమే కాకుండా తక్షణ నగదు అవసరాలను తీరుస్తుంది. ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టి నిమిషాల్లోనే లోన్ పొందవచ్చు. ఇందుకు ఎలాంటి పూచీకత్తు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ బంగారాన్ని పూచీకత్తుగా బ్యాంకుకు అప్పగిస్తున్నారు గనుక ఎలాంటి గ్యారెంటీలు పెట్టాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా పెద్దగా ఉండదు గనుక నిమిషాల్లోనే లోన్ వచ్చేస్తుంది.
10 గ్రాముల బంగారానికి ఎంత లోన్..?
అయితే ఎంత బంగారానికి ఎంత లోన్ వస్తుందనే డౌట్ చాలామందికి ఉంటుంది. 10 గ్రాముల బంగారం తాకట్టు పెడితే ఎంతవరకు పొందవచ్చు అనేది చూస్తే.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బంగారం మార్కెట్ విలువలో 75 శాతం వరకు బ్యాంకులు రుణంగా అందిస్తాయి. ఉదాహరణకు 10 గ్రామలు బంగారం ధర ప్రస్తుతం రూ.లక్ష ఉందని అనుకుంటే.. 75 శాతం అంటే రూ.75 వేలు పొందుతారు. ఇక కొన్ని ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు 85 శాతం వరకు రుణాలు అందిస్తున్నాయి. ఇక వడ్డీ రేట్ల విషయానికొస్తే.. బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు 8.65 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎంత గోల్డ్‌కు ఎంత లోన్ ఇవ్వాలి.. వడ్డీ రేట్లు ఎంత ఉండాలి అనేది నిర్ణయించబడుతుంది. ఆ పరిమితి మేరకే మాత్రమే బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి.
ఈఎంఐ రూపంలో తీసుకుంటున్నారా..?
ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ రేటు 9 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటుంది. మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పరిశీలించుకోండి. తక్కువ వడ్డీ రేట్లు ఎక్కడ అంటే ఆ బ్యాంకులో లోన్ తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల మీకు డబ్బులు ఆదా అవుతాయి. ఇక ఈఎంఐ రూపంలో చెల్లించాలనుకుంటున్నారా..? లేదా ఒకేసారి చెల్లించాలనుకుంటున్నారా? అనే ఆప్షన్ కూడా జాగ్రత్తగా ఎంచుకోండి. మీ ఆదాయానికి సరిపడ విధంగా చెల్లింపు ప్లాన్ ఎంచుకోండి. ఇక గోల్డ్ లోన్ తక్కువ వడ్డీకే లభిస్తుందనే కారణంతో చాలామంది అవసరం లేకపోయినా తీసుకుంటారు. ఇలా తీసుకోవడం తెలివైన నిర్ణయం కాదు. ఎందుకంటే ప్రాసెసింగ్ ఫీజులు, జరిమానా ఫీజులు వంటి రుసుంలు ఉంటాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గోల్డ్ లోన్ తీసుకోవాలి.
