మెటావర్స్‌ను మూసివేసిన మార్క్‌ మామ! కారణం ఏంటంటే..?

మెటా తన హొరైజన్ వరల్డ్స్ వీఆర్ ప్లాట్‌ఫామ్‌ను 2026 నాటికి మూసివేయాలని నిర్ణయించింది. భారీ నష్టాలు, ఆశించిన స్పందన లేకపోవడంతో మెటావర్స్ ప్రాజెక్ట్‌ను వెనక్కి నెట్టింది. వీఆర్ వెర్షన్ పోయినా మొబైల్ యాప్‌గా ఇది కొనసాగుతుంది. ఈ మార్పు సంస్థ భవిష్యత్తు వ్యూహంలో కీలక ఘట్టం.

మెటావర్స్‌ను మూసివేసిన మార్క్‌ మామ! కారణం ఏంటంటే..?
Meta Horizon Worlds

Updated on: Mar 19, 2026 | 1:50 PM

ప్రపంచ టెక్ రంగంలో పెద్ద చర్చకు దారితీసిన మెటావర్స్ ప్రాజెక్ట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. మెటా ప్లాట్‌ఫామ్స్‌ సంస్థ తన వర్చువల్ రియాలిటీ (వీఆర్) సోషల్ ప్లాట్‌ఫామ్ హొరైజన్ వరల్డ్స్ ను వీఆర్ పరికరాల కోసం మూసివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం 2026 జూన్ 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు హొరైజన్ వరల్డ్స్ యాప్‌ను 2026 మార్చి చివరినాటికి క్వెస్ట్ స్టోర్ నుండి తొలగించనున్నారు. అయితే వినియోగదారులు ఈ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇది మొబైల్ యాప్ రూపంలో కొనసాగనుంది. కానీ వీఆర్ పరికరాల ద్వారా అనుభవించే వర్చువల్ ప్రపంచం ఇక అందుబాటులో ఉండదు.

2021లో మార్క్‌ జూకర్‌బర్గ్‌ నేతృత్వంలో మెటావర్స్ కాన్సెప్ట్‌ను భారీ ఆశలతో ప్రవేశపెట్టిన మెటా, అప్పట్లో తన పేరును కూడా మార్చుకుంది. వాస్తవ ప్రపంచానికి ప్రత్యామ్నాయంగా వర్చువల్ ప్రపంచాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వినియోగదారుల స్పందన ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ప్రాజెక్ట్ ఇబ్బందులు ఎదుర్కొంది. హొరైజన్ వరల్డ్స్ ప్రారంభంలో కేవలం మెటా క్విస్ట్‌ పరికరాలకే పరిమితమైంది. తరువాత 2023లో మొబైల్ వెర్షన్ అందుబాటులోకి తీసుకువచ్చినా, వినియోగదారుల సంఖ్య పెద్దగా పెరగలేదు. నెలవారీ యాక్టివ్ యూజర్లు కొన్ని లక్షలకే పరిమితమయ్యారని సమాచారం.

ఇదిలా ఉండగా మెటా రియాలిటీ ల్యాబ్స్ విభాగం 2020 నుంచి భారీ నష్టాలను చవిచూసింది. దాదాపు 80 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఖర్చులను తగ్గించే క్రమంలో కంపెనీ ఉద్యోగులను కూడా తొలగించింది. పరిశ్రమ వర్గాల అభిప్రాయం ప్రకారం, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడంలో లోపాలు, సాంకేతిక పరిమితులు, ప్రాజెక్ట్ నిర్వహణలో సమస్యలు ఈ వైఫల్యానికి కారణాలుగా నిలిచాయి. అయితే మెటా తన వ్యూహాన్ని మార్చుకుంటూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), స్మార్ట్ గ్లాసెస్ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ర్యాన్‌ బ్యాన్‌తో భాగస్వామ్యంగా రూపొందించిన స్మార్ట్ గ్లాసెస్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. మెటావర్స్‌పై భారీ పెట్టుబడులు పెట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మెటా వెనక్కి తగ్గింది. భవిష్యత్తులో ఏఐ, ఇతర డిజిటల్ టెక్నాలజీలపై దృష్టి పెట్టడం ద్వారా సంస్థ తన వ్యాపార దిశను మార్చుకుంటోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us