దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి అక్టోబర్‌లో నెలలో 2,02,402 యూనిట్ల రికార్డు రిటైల్ అమ్మకాలను సాధించింది. ఇక నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వివాహాలు జరగనుండటంతో ఈ వృద్ధి మరింత పెరగడం ఖాయంగా ఆ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. మ్యారేజ్ సీజన్ విక్రయాల జోరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 4-5% వృద్ధిని ఆ సంస్థ అంచనా వేస్తోంది.
పండుగ సీజన్ డిమాండ్ కారణంగా ఇప్పటి వరకు అత్యధిక అమ్మకాలను అక్టోబర్ మాసంలో నమోదు చేసింది. అక్టోబర్ 2020లో నెలకొల్పిన 191,476 యూనిట్ల మునుపటి రికార్డును అధిగమించింది. ఇక గత ఏడాది ఇదే నెలలో ఆటో మేజర్ సంస్థ మొత్తం 1,99,217 యూనిట్లను విక్రయించినట్లు మారుతీ సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు కార్ల విక్రయాల్లో 4 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. నవంబర్ మాసంలో లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి.. పెళ్లి సీజన్ కారణంగా తమ కార్ల విక్రయాలు కూడా భారీగా పెరిగే అవకాశమున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.
అక్టోబర్ నెలలో పండుగ విక్రయాల సందర్భంగా కొనసాగిన అమ్మకాల జోరను నవంబర్‌లో పెళ్లిళ్ల సీజన్ వెళ మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక సిద్దంగా ఉందని.. కంపెనీ రిటైల్ అమ్మకాల పరంగా కూడా ఇది మాకు మంచి ట్రాక్షన్ ఇస్తుందని మేము చాలా ఆశాభావంతో ఉన్నామని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్తో బెనర్జీ పిటిఐకి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4-5 శాతం వృద్ధి అంచనాతో మారుతి సుజుకి ఇండియా ట్రాక్‌లో కొనసాగుతుందని నమ్మకంగా ఉంది.
దీపావళి ముగియడంతో ఇప్పుడు వ్యాపారులు, రీటైల్ సంస్థలు మ్యారేజ్ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించాయి. లక్షలాది పెళ్లిళ్లు జరగనుండటంతో తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయాలుగా సాగిపోతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మ్యారేజ్ సీజన్‌లో ఇతర కంపెనీల నుంచి పోటీ నెలకొనడంతో దీపావళి తర్వాత కూడా ప్రత్యేక ఆఫర్స్‌ను కొనసాగించే యోచనలో ఉన్నాయి కంపెనీలు.