
చెక్‌బుక్ కనిపించకుండా పోవడం లేదా దొంగతనానికి గురికావడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా బ్లాంక్‌గా ఉన్న లేదా ముందుగానే సంతకం చేసిన చెక్కులు ఇతరుల చేతికి చిక్కితే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా చేసేందుకు కూడా మోసగాళ్లు ప్రయత్నించే ప్రమాదముంది. అందుకే చెక్‌బుక్ కనిపించకపోయిన వెంటనే కొన్ని కీలక చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
చెక్‌బుక్ పోయిందని గుర్తించిన వెంటనే మీ బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి ‘స్టాప్ పేమెంట్’ చేయించాలి. బ్యాంక్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పోయిన చెక్‌లపై చెల్లింపులను నిలిపివేయాలని కోరాలి. చాలా బ్యాంకుల్లో మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెక్‌బుక్‌లోని మొత్తం చెక్‌లకు లేదా నిర్దిష్ట చెక్ నంబర్లకు స్టాప్ పేమెంట్ పెట్టే సదుపాయం ఉంటుంది. ఆన్‌లైన్‌లో వీలుకాకపోతే హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. బ్యాంకు నుంచి వచ్చిన రసీదు లేదా కన్ఫర్మేషన్ నంబర్‌ను తప్పనిసరిగా భద్రపరచుకోవాలి.
చెక్‌బుక్ దొంగతనం పోయినట్లు భావించినా, ఎక్కడో పోయినా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. కొన్ని ప్రాంతాల్లో డాక్యుమెంట్లు పోయినట్లు ఆన్‌లైన్‌లో ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫిర్యాదులో చెక్‌బుక్‌లో ఎన్ని చెక్‌లు ఉన్నాయో, వాటిలో ఏవైనా ముందుగానే సంతకం చేసినవి ఉన్నాయో స్పష్టంగా పేర్కొనాలి. పోలీసుల నుంచి లభించిన FIR లేదా NCR కాపీని బ్యాంకుకు కూడా అందించడం మంచిది.
పోయిన చెక్‌బుక్‌లో ఇప్పటికే సంతకం చేసిన చెక్కులు ఉంటే ఈ విషయాన్ని బ్యాంకుకు తక్షణమే తెలియజేయాలి. ఖాతాలో జరిగే లావాదేవీలను క్రమం తప్పకుండా పరిశీలించడంతో పాటు SMS అలర్ట్‌లను యాక్టివేట్ చేసుకోవాలి. మీ అకౌంట్‌లో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. ఆర్థిక మోసం జరిగినట్లు అనుమానం ఉంటే 1930కు కాల్ చేయడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.
భవిష్యత్తులో చెక్‌బుక్ మోసాలకు దూరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
చెక్‌బుక్ పోయిన విషయం తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాన్ని తగ్గించుకునే వీలుంటుంది. ఏం కాదులే అనుకుంటే మీరు ఆర్థిక మోసగాళ్ల బారినపడే ప్రమాదం ఉంటుంది.