ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైలింగ్.. చిన్న జాగ్రత్తలు.. జరిమానాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి!
2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి ITR ఫైలింగ్ ప్రారంభమవడంతో పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పు ITR ఫారమ్ ఎంపిక, ఆదాయం దాచిపెట్టడం, AIS-26AS పొంతన లేకపోవడం, ఇ-వెరిఫికేషన్ మర్చిపోవడం వంటి చిన్న పొరపాట్లు కూడా నోటీసులు, జరిమానాలు, రీఫండ్ ఆలస్యాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

2026 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2026-27) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు ప్రక్రియ ప్రారంభమవడంతో పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లు కూడా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు, రీఫండ్ ఆలస్యం, అదనపు పన్ను భారం, జరిమానాలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫారం 26AS, AIS, ఫారం 16, ప్రీ-ఫిల్డ్ డేటాను సరిపోల్చకుండా రిటర్న్ ఫైల్ చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు.
పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయానికి అనుగుణంగా సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోవడం అత్యంత కీలకం. తప్పు ఫారమ్ ఎంపిక చేస్తే ఆ రిటర్న్‌ను లోపభూయిష్టంగా పరిగణించే అవకాశం ఉంది. దీంతో ప్రాసెసింగ్ ఆలస్యం కావడమే కాకుండా ఆదాయపు పన్ను శాఖ నుంచి వివరణ కోరుతూ నోటీసులు రావచ్చు. చాలామంది జీతం ఆదాయం మాత్రమే చూపించి బ్యాంక్ వడ్డీ, డివిడెండ్లు, అద్దె ఆదాయం, ఫ్రీలాన్స్ సంపాదన లేదా విదేశీ ఆదాయాన్ని వెల్లడించకుండా వదిలేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖకు వివిధ వనరుల నుంచి డేటా అందుబాటులో ఉండటంతో ఆదాయం దాచడం సులభంగా గుర్తించే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల అన్ని ఆదాయ వనరులను సరిగ్గా ప్రకటించడం అవసరం.
అలాగే షేర్లు మ్యూచువల్ ఫండ్లు లేదా ఆస్తుల అమ్మకాల ద్వారా వచ్చిన మూలధన లాభాలను తప్పుగా చూపడం కూడా సమస్యలకు దారితీయవచ్చు. పెట్టుబడుల వివరాలు, కొనుగోలు ధర, అమ్మకపు విలువ వంటి అంశాలను ఖచ్చితంగా నమోదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశీ బ్యాంకు ఖాతాలు, విదేశీ ఆస్తులు లేదా విదేశీ ఆదాయాన్ని దాచిపెడితే భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. పన్ను చట్టాల ప్రకారం అలాంటి వివరాలను వెల్లడించడం తప్పనిసరి. కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం మధ్య సరైన పోలిక చేయకుండా ఏదో ఒకదాన్ని ఎంచుకోవడం వల్ల ఎక్కువ పన్ను చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే రెండు విధానాల్లో పన్ను లెక్కలు చూసి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ITR ఫైల్ చేసిన తర్వాత ఇ-వెరిఫికేషన్ పూర్తి చేయడం కూడా తప్పనిసరి. అది చేయకపోతే రిటర్న్ చెల్లనిదిగా పరిగణించబడుతుంది. అలాగే బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్ వంటి వివరాలు తప్పుగా నమోదు చేస్తే రీఫండ్ ఆలస్యం కావచ్చు. అందువల్ల అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి మాత్రమే ITR దాఖలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
